Criminal trap with mobile applications
ఉచితం.. సమాచారం ఖతం

మొబైల్ అప్లికేషన్లతో నేరస్థుల వల
వ్యక్తిగత వివరాలన్నీ పరుల చేతుల్లోకి
మోసపోతున్న నగరవాసులు
మొబైల్ యాప్‌లతో సమయం సద్వినియోగమవుతున్నా సౌకర్యంతోపాటు ప్రమాదాలూ పొంచి ఉన్నాయ్. ఉచితంగా వస్తున్నాయని ఎడాపెడా యాప్‌లను ఫోన్, ట్యాబ్, కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేస్తున్నారా? జాగ్రత్త.. వీటిలో కొన్ని ప్రమాదకరమని కొద్దినెలల క్రితం కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి.
ఈ మధ్యకాలంలో కూరగాయలు కొనాలంటే పేటీఎం, మందులు కొనేందుకు ఫోన్‌పే, చివరకు హోటల్‌కు వెళ్లి నగదు బదులు గూగుల్‌పే.. ఇలా డిజిటల్ కరెన్సీ ఇచ్చేందుకు జనం మొబైల్ అప్లికేషన్లను ఉపయోగిస్తున్నారు.
సినిమా థియేటర్‌కు వెళ్లి టికెట్లు కొనేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. విభిన్న యాప్‌ల వినియోగం ఎక్కువవుతున్నకొద్దీ సైబర్ నేరాలూ పెరుగుతున్నాయి.
ఈనాడు, హైదరాబాద్:
సైబర్ నేరస్థులు మొబైల్ యాప్‌లు ఉచితమంటూ ప్రచారం చేసి వాటిని డౌన్లోడ్ చేసుకోగానే ఆయా ఫోన్ యజమానుల వ్యక్తిగత రహస్యాలను తీసుకుని డబ్బు వసూలు చేస్తున్నారని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ‘క్విక్ సపోర్ట్’ ‘టీమ్ వ్యూయర్’ యాప్‌ల ద్వారా..
రెండు నెలల వ్యవధిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో సైబర్ నేరస్థులు రూ.1.50 కోట్లు నగదు బదిలీ చేసుకున్నారని పోలీసులు అంచనా వేస్తున్నారు.
మాటల్లో పెట్టి నగదు లాగేస్తున్నారు..
ఉచిత మొబైల్ అప్లికేషన్లను చరవాణుల వినియోగదారులకు, విద్యార్థులు, సంస్థలకు కొందరు నేరస్థులు ఎరగా వేస్తున్నారు. ఆ అప్లికేషన్‌ను క్లిక్ చేయగానే ఆయా సంస్థలు, వ్యక్తుల డేటాను చోరీ చేస్తున్నారు. అనంతరం బాధితులకు ఫోన్ చేసి మాటల్లో పెట్టి నగదు లాగేస్తున్నారు.
సంస్థల నుంచి తస్కరించిన సమాచారాన్ని వాటి ప్రత్యర్థి కంపెనీలకు విక్రయిస్తామంటూ బెదిరిస్తున్నారు. వారు డిమాండ్ చేసిన సొమ్మును ఇచ్చాకే మాల్వేర్, రాన్సమ్‌వేర్‌లను తొలగిస్తున్నారు. హైదరాబాద్, దిల్లీ, బెంగళూరు, చెన్నై కేంద్రాలుగా సైబర్ నేరగాళ్లు కొద్దినెలల నుంచి ఉచిత మొబైల్ యాప్‌ల ప్రకటనలను గుప్పిస్తున్నారు.
ప్రమాదం గుప్పెట్లో..
ఉచితంగా వచ్చే మొబైల్ అప్లికేషన్లలో చాలా ప్రాచుర్యం పొందినవాటితోపాటు నిత్యం మనం ఉపయోగించేవీ ఉన్నాయి. కేంద్ర నిఘా విభాగం కొన్ని వందల మొబైల్ అప్లికేషన్లను విశ్లేషించగా ఎక్కువగా చైనా తయారీ మొబైల్ ఫోన్లు, అప్లికేషన్లను నేరాలకు వినియోగిస్తున్నారని నిర్ధారణ అయ్యింది.
అంతర్జాలం లేకుండా పనిచేస్తుందంటూ కొన్ని కంపెనీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఫేస్బుక్, ట్విటర్ల ద్వారా ఫలానా కంపెనీల ఉత్పత్తులు ఉచితంగా తీసుకోండి.. అంటూ ఈ-మెయిల్స్‌కు సందేశాలు పంపుతున్నాయి. వీటిలో 90 శాతం నేరపూరితమైనవే. ఆ యాప్‌లను వినియోగిస్తున్న వారి ఫొటోలను మార్ఫింగ్ చేయడం, అశ్లీల వీడియోలను వారి ముఖాలతో మార్చి బ్లాక్మెయిల్ చేస్తున్నారు.
తెలుసుకొన్నాకే డౌన్లోడ్: కె.వి.ఎం.ప్రసాద్, ఏసీపీ సైబర్ క్రైమ్స్
అంతర్జాలంలో అందుబాటులో ఉన్న మొబైల్ అప్లికేషన్ల చరిత్రను పరిశీలించాకే వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్లకు అనుబంధంగా నైజీరియన్లు, సైబర్ నేరగాళ్లు ప్రమాదకరమైన లింకులను పంపుతున్నారు.
వాటిని క్లిక్ చేయగానే పేరు, ఫోన్ నంబరు, బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలన్నీ వారికి తెలిసిపోతున్నాయి. వెంటనే ఆ వివరాలను తీసుకుని డబ్బుకోసం డిమాండ్ చేస్తున్నారు. మాల్వేర్ వైరస్‌లను గుర్తించడం అంత సులువు కాదు.