ప్రతి శుక్ర, శనివారాల్లో 22ఏ దరఖాస్తుల పరిశీలన

ప్రతి శుక్ర, శనివారాల్లో 22ఏ దరఖాస్తుల పరిశీలన
నిషేధిత భూముల జాబితా (22ఎ) నుంచి మినహాయింపు కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వస్తోన్న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎల్.శివశంకర్ వెల్లడించారు.
శుక్రవారం కలెక్టరేట్లో తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఇలాంటి దరఖాస్తులు 400 వరకూ పెండింగ్లో ఉన్నాయని, ప్రతి శుక్ర, శనివారాలు వాటి పరిష్కారానికి అధికారుల వాదనలు విని తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జిల్లాలో భూముల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాలు అవినీతికి దూరంగా ఉండేలా ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని జేసీ స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత తహసీల్దార్లదేనని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ భూములకు ప్రహరీ ఏర్పాటు చేసే అధికారాలను వారికి అప్పగించామన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం భూములను పరిశీలిస్తున్నామన్నారు.
వాలంటీర్ల నియామకాలు పూర్తయితే ఇంటింటికీ రేషను సరకులు పంపిణీ చేసే అంశాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. అర్హులైన వారికి రేషను కార్డులు జారీ చేస్తామని, దరఖాస్తులు చేసుకుంటే వాటిని పరిశీలించి, దశల వారీగా ప్రభుత్వం మంజూరు చేస్తుందని వివరించారు.