News

Realestate News

Collisions coast Kailasagiri infrastructure


తీరానికి కొత్తందాలు

● కైలాసగిరిపైనా మౌలిక వసతులు

● రూ. 200 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధుల విడుదల

విశాఖ నుంచి భీమిలి వరకు తీర ప్రాంత అభివృద్ధికి ఎట్టకేలకు రూ. 199.56 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులు విడుదలయ్యాయి. త్వరలో టెండర్లను ఆహ్వానించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అంతా సక్రమంగా జరిగితే మే చివరి వారానికల్లా పనులు మొదలయ్యే అవకాశం ఉంది. 2014 అక్టోబరులో హుద్‌హుద్‌ తీవ్ర పెనుతుపాను దెబ్బకు తీర ప్రాంతం కోతకు గురైంది.

కొన్నిచోట్ల బీచ్‌ రహదారి ధ్వంసమైంది. నడకదారులు, ఉద్యానవనాలు కూడా దెబ్బతిన్నాయి. కైలాసగిరిపైనా మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన తీసుకున్న చర్యల కారణంగా పరిస్థితి కొలిక్కి వచ్చింది.

నాటి విపత్తును దృష్టిలో పెట్టుకుని ఆనాడు దెబ్బతిన్న ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థ అంతర్జాతీయ అభివృద్ధి, పునరుద్ధరణ సంస్థ రుణం ఇవ్వడానికి ముందుకొచ్చింది. అన్ని రకాల అనుమతులు పూర్తవ్వడంతో ఎట్టకేలకు రుణం విడుదలైంది.

భవిష్యత్తులో విపత్తులు సంభవించినా తీరానికి ఎలాంటి నష్టం వాటిల్లకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆలోచనలు చేసింది. కైలాసగిరిపై అధునాతన వసతులు సమకూర్చి, రహదారులను నిర్మించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే 2015 జులైలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు మధ్య ఒప్పందం కుదిరింది.

● *భీమిలి నుంచి ఆర్కే బీచ్‌ వరకు తీర ప్రాంత పునరుద్ధరణ పనులను రెండు దశల్లో అంటే ప్యాకేజీ 1, ప్యాకేజీ 2 కింద చేపడతారు. వీటిని జీవీఎంసీ పర్యవేక్షిస్తుంది.

● *380 ఎకరాల్లోని కైలాసగిరి కొండ అభివృద్ధి పనులను వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో చేపడతారు.

● *ఈ ప్రాజెక్టు అమల్లో ఏపీఈపీడీసీఎల్‌, పంచాయతీరాజ్‌ శాఖ, రహదారులు భవనాల శాఖ, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏతోపాటు అటవీశాఖ భాగస్వామ్యం ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన దళ సూచనలను కూడా తీసుకోమంది.

జీవీఎంసీ ఆధ్వర్యంలో..

*జీవీఎంసీ ఆధ్వర్యంలో భీమిలి తీర ప్రాంతంతో పాటు విశాఖ నగరంలోని ఆర్‌కే బీచ్‌ నుంచి వైఎంసీఏ వరకు తీర ప్రాంత అభివృద్ధి పనులు చేపడతారు. ఇందుకోసం రూ. 140 కోట్లు వెచ్చించనున్నారు.

ఎన్నికలకు ముందే టెండర్లను ఆహ్వానించాల్సి ఉండగా.. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమీక్ష సమావేశం కారణంగా ఆలస్యమైందని జీవీఎంసీ ప్రాజెక్ట్సు *డీఈఈ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

టెండర్లు ఆహ్వానిస్తున్నామని, వీటిని ఈ నెల 20న ఆన్‌లైన్‌లో ఉంచుతామని చెప్పారు. మే నెలాఖరు నాటికి పనులు ప్రారంభించే అవకాశం ఉందన్నారు.

*కైలాసగిరిపై పనులకు సంబంధించి ఈ నెలాఖరు నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వివిధ ఆకృతుల ఎంపిక, ఎక్కడెక్కడ ఏ పనులు చేపట్టాలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రాజెక్టు డీపీఆర్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేపట్టాల్సి ఉంది.