ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి సీఎం కృషి: ఎంపీ

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి సీఎం కృషి: ఎంపీ
ఎంపీ దంపతులను సత్కరిస్తున్న సంఘ నేతలు
రాష్ట్రంలోని ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఎంపీ సత్యవతి చెప్పారు. అనకాపల్లిలో ఆదివారం జరిగిన పీఆర్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరడంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించారన్నారు. అందుకే ముఖ్యమంత్రి అన్నివిధాలా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
విద్యామంత్రితో మాట్లాడి, ఏకీకృత సర్వీసు నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని లోక్సభలో ప్రస్తావిస్తానన్నారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కాంట్రిబ్యూటరీ పింఛను పథకాన్ని (సీపీఎస్) రద్దు చేయడానికి చర్యలు చేపట్టారన్నారు.
బదిలీలు, 610 జీఓ, 398 వేతనం ఉపాధ్యాయులు, పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
వివేకానంద ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ కాండ్రేగుల విష్ణుమూర్తి మాట్లాడుతూ సమాజంలో ఎవరికీ లేని విలువ ఉపాధ్యాయులకు ఉందన్నారు. దీనిని మరింత పెంచడానికి కృషి చేయాలన్నారు.
మాజీ ఎమ్మెల్సీ, పీఆర్టీయూ నాయకుడు గాదె శ్రీనివాసులునాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయ, పాఠశాలల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ అభినందనీయమన్నారు.
పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు భైరి అప్పారావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బుద్ద కాశీ విశ్వేశ్వరరావు, డి.గోపీనాథ్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఎంపీ, ఎమ్మెల్యేలతోపాటు జిల్లా అధ్యక్షుడు బుద్ద కాశీ విశ్వేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు భీశెట్టి గంగాధర్, రాష్ట్ర అధ్యక్షుడు బైరి అప్పారావు, మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు తదితరులను సత్కరించారు.