ప్రజా భాగస్వామ్యంతోనే మార్పు సాధ్యం
ప్రజా భాగస్వామ్యంతోనే మార్పు సాధ్యం
ప్రజా భాగస్వామ్యంతో మార్పును తీసుకురావడానికి పోలీసు శాఖ పనిచేస్తోందని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. గురువారం సాయంత్రం ఏయూ పాలక మండలి సమావేశంలో ఆయన వర్సిటీ ఉపకులపతి ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి సమక్షంలో ప్రధానాచార్యులతో సమావేశమయ్యారు.
డీజీపీ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం రాష్ట్రంలో ఒక కొత్త మార్పును తీసుకురావడానికి కృషి చేస్తోందన్నారు. ప్రజల సంక్షేమం, మహిళల రక్షణ ప్రధానంగా సేవలను విస్తరిస్తామన్నారు.
పోలీసు శాఖకు సహకారం అందించడానికి వర్సిటీ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి చూపిన చొరవ ఎంతో అభినందనీయమన్నారు.
వర్చువల్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని వీసీ ప్రసాదరెడ్డి చేసిన ప్రతిపాదన ఎంతో బాగుందన్నారు. ఈ ఆలోచనలతో తక్కువ ఖర్చుతో పోలీసుల సేవలు ప్రజలకు చేరువవుతాయన్నారు.
సులభంగా ఫిర్యాదు చేసే అవకాశం కలుగుతుందన్నారు. విద్యాసంస్థలు, ఇతర సంస్థలతో కలసి పనిచేయడం ఎంతో అవసరమన్నారు. ఏయూతో కలసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ సామాజిక సమస్యలపై విశ్వవిద్యాలయం పనిచేస్తుందన్నారు. సమస్యలకు అవసరమైన పరిష్కారాలను అన్వేషించే దిశగా సేవలు అందిస్తుందన్నారు.
కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా, రెక్టార్ ఆచార్య ఎం.ప్రసాదరావు, రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, అకడమిక్ డీన్ ఆచార్య కె.వెంకటరావు, ప్రిన్సిపల్ ఆచార్య పేరి శ్రీనివాసరావు, ఆచార్య కె.రామమోహనరావు, ఆచార్య రమణమూర్తి, ఆచార్య టి.వినోదరావు, ఆచార్య శివప్రసాద్, ఆచార్య ఎస్.సుమిత్ర, ఆచార్య ఎం.ప్రమీలాదేవి, డాక్టర్ చల్లా రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం వర్సిటీ తరఫున డీజీపీ గౌతం సవాంగ్‌ను సత్కరించి జ్ఞాపికను బహూకరించారు.