News

Realestate News

భళా అమ్మఒడి.. బాగుపడేదెలా బడి!

Bhala Amma .. How good it is.


భళా అమ్మఒడి.. బాగుపడేదెలా బడి!

దేవరాపల్లిలోని ఓ పాఠశాలలో పెచ్చులూడి ప్రమాదకరంగా మారిన తరగతి గది

సర్కారు పాఠశాలల్లో ఏటా విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టు వసతులు పెరగడం లేదు. తరగతి గదులు మొదలుకొని మరుగుదొడ్ల వరకు అన్నింటా కొరతన్న మాటే వినిపిస్తోంది.

విద్యార్థి, మౌలిక సదుపాయాల నిష్పత్తిలో వ్యత్యాసం భారీగా పెరిగిపోతోంది. కొన్నేళ్లగా అరకొర నిధులు, అత్తెసరు పనులతోనే నెట్టుకొస్తున్నారు. ఫలితంగా సరస్వతీ నిలయాలను సమస్యలు వీడడం లేదు.

అమ్మఒడి లాంటి పథకంతో కొత్త విద్యార్థులను సైతం ఆకర్షిస్తున్న ప్రభుత్వం, వసతుల కల్పనపై దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

గతేడాది అన్ని పాఠశాలల్లోనూ మౌలిక వసతుల కోసం హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌ (హేమ్‌) పథకంలో భారీగా నిధులు కేటాయించారు. పనులు కార్యరూపంలోకి వెళుతున్న దశలో ప్రభుత్వం మారడం ఆ పథకాన్ని రద్దు చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

తాజాగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతులు కల్పించేందుకు రూ. 128 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలకు మోక్షం కలిగితేనే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది.

జిల్లాలో ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్‌ పరిధిలో 4,101 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3.34 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 30 మంది పిల్లలకు ఒక తరగతి గది ఉండాలి. 40 మంది పిల్లలకు ఒక మరుగుదొడ్డి చొప్పున నిర్మించాలి.

ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నిష్పత్తి అమలు కావడం లేదు. ఉన్నత పాఠశాలల్లో వందల సంఖ్యలో విద్యార్థులుంటే ఒకట్ల సంఖ్యలో తరగతి గదులుంటున్నాయి.

మరుగుదొడ్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉన్నాయి. పిల్లలు ఒకటికి, రెండుకు ఆరుబయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. పాఠశాలల్లో తాగునీటి వెతలు తీరడం లేదు.

ఉన్న ఒక్క చేతి పంపుపైనే వందల మంది విద్యార్థులతో పాటు మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆధారపడుతున్నారు. ఇక ఇతర మౌలిక సదుపాయలన్నీ దస్త్రాల్లో తప్ప క్షేత్రస్థాయిలో కనిపించే పరిస్థితి లేదు.

తాజాగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై దృష్టిసారించారు. ప్రతి పాఠశాలలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ఫొటోలు తీసి స్కూల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎస్‌టీఎంఎస్‌) యాప్‌లో నమోదు చేయిస్తున్నారు.

సదుపాయాలు మెరుగుపరిచిన తరువాత మరలా ఆ ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్‌ చేసి రెండింటికీ తేడా చూపిస్తామన్నారు. దీంతో ఈ సారైనా పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడతాయని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆశపడుతున్నారు.

పెరుగుతున్న ప్రవేశాలు..

ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నేళ్లుగా విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, బూట్లు.. అన్నీ సమకూర్చుతుండడంతో ఏటా ప్రైవేటు పాఠశాలలను విడిచి సర్కారు బడుల్లో చేరుతున్నారు.

2018-19లో ప్రైవేటు పాఠశాలల నుంచి సుమారు 15,050 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య మరింత పెరిగింది. అమ్మఒడి పథకంతో ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలలను కాదని ఇప్పటికే 16,715 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు.

ఇంతవరకు బాగానే ఉన్నా పెరుగుతున్న విద్యార్థులకు అనుగుణంగా వసతులు పెరగకపోవడమే ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. కొత్తగా సర్కారు బడుల్లో చేరిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాల నుంచి తాగునీటి సదుపాయం వరకు వసతులు పెంచాల్సిన అవసరం ఉంది.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo