News

Realestate News

సచివాలయాల్లో మరో 550 పోస్టులు


సచివాలయాల్లో మరో 550 పోస్టులు

 

 జిల్లాలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో వివిధ శాఖల ద్వారా 10,782 పోస్టులను భర్తీ చేయడానికి గత నెల 27న సర్కారు ఉద్యోగ ప్రకటన జారీచేసింది.

తాజాగా తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ వ్యవస్థ (ఈపీడీసీఎల్‌) కూడా సచివాలయల్లో విద్యుత్తు సహాయకుల (జూనియర్‌ లైన్‌మేన్‌ గ్రేడ్‌-2) పోస్టుల భర్తీకి వేరేగా నోటిఫికేషన్‌ ఇచ్చింది.

దీంతో జిల్లాలో అదనంగా మరో 550 పోస్టులు భర్తీకి అవకాశం లభించింది. ఈపీడీసీఎల్‌ ద్వారా 739 గ్రామ సచివాలయాల్లో 277 విద్యుత్తు సహాయకులు, 604 వార్డు సచివాలయల్లో 273 జూనియర్‌ లైన్‌మేన్‌లను నియమించనున్నారు.

ఈ మేరకు శుక్రవారం నుంచే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఐటీఐ ఎలక్ట్రికల్‌, వైర్‌మెన్‌ ట్రేడ్‌తో పదోతరగతి ఉత్తీర్ణులైనవారు, సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్ఛు.

* ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఒప్పంద ఉద్యోగులకు ఆరు నెలలకు ఒక మార్కు చొప్పున గరిష్ఠంగా 20 మార్కులు వెయిటేజీ ఇవ్వనున్నారు. స్థానిక అభ్యర్థులకు 80 శాతం ప్రాధాన్యం ఇస్తారు. పురుష అభ్యర్థులే అర్హులు.

ఈనెల 17 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. జిల్లాలో భర్తీచేయబోయే సచివాలయ పోస్టుల సంఖ్య 10,782 నుంచి 11,332కు పెరగడంతో నిరుద్యోగ యువతలో సంతోషం వ్యక్తమవుతోంది.

ఈ సర్కారు కొలువులు కోసం దరఖాస్తు చేయడానికి పోటెత్తుతున్నారు. భారీ సంఖ్యలో భర్తీచేస్తున్న ఈ పోస్టులను ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో స్వల్పకాలిక శిక్షణ కేంద్రాల్లోను చేరుతున్నారు.

వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులు తాత్కాలికంగా సెలవులు పెట్టి సాధనలో మునిగి తేలుతున్నారు.

మరోవైపు అధికారులు కూడా ఈ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్‌ 1న రాత పరీక్షలు నిర్వహించి అక్టోబర్‌ 2 నాటికి నియామకాలన్నీ పూర్తి చేయడానికి కసరత్తు ముమ్మరం చేశారు.