ఏయూఅభివృద్ధికిపదేళ్ల ప్రణాళిక

ఏయూఅభివృద్ధికిపదేళ్ల ప్రణాళిక

బాధ్యతలు స్వీకరించి సంతకం చేస్తున్న ఆచార్య ప్రసాదరెడ్డి
ఆంధ్ర విశ్వవిద్యాలయ అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక రూపొందించాం. వర్సిటీలో సేవా కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యలను ఒక్క రోజులోనే పరిష్కరిస్తాం.
మార్కుల జాబితాల కోసం విద్యార్థులు వర్సిటీ చుట్టూ తిరగనవసరం లేకుండానే వారి ఇళ్లకే పంపిస్తాం. జాతీయ విద్యా సంస్థలు అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికలను ఇక్కడ కూడా అనుసరిస్తాం.
ఆచార్య ప్రసాదరెడ్ఢి ఆంధ్ర విశ్వవిద్యాలయ నూతన ఉప కులపతి (పూర్తి అదనపు బాధ్యతలు)గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనరతరం మీడియాతో అన్న మాటలు.
ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రా విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతి (పూర్తి అదనపు బాధ్యతలు)గా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ ఆచార్యులు పి.వి.జి.డి. ప్రసాదరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. తొలుత ఏయూ పరిపాలన భవనానికి 1942లో వేసిన శిలాఫలకం వద్ద పుష్పాలను ఉంచారు.
అనంతరం మహాత్మాగాంధీ, మహాత్మా జ్యోతిరావు ఫులే, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, వర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డికి నివాళులర్పించి కార్యాలయానికి చేరుకున్నారు.
ఆయనకు తన సోదరి డాక్టర్ పి.ఎ.ఎల్.రజని, పూర్వ వీసీ ఆచార్య బీల సత్యనారాయణ, రెక్టార్ ఆచార్య ఎం.ప్రసాదరావు, రిజిస్ట్రార్ ఆచార్య టి.బైరాగిరెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. డి.ఎస్.ఎన్.ఎల్.యు. మాజీ వీసీ ఆచార్య వై.సత్యనారాయణ, వర్సిటీ ప్రిన్సిపాళ్లు పేరి శ్రీనివాసరావు, రమణమూర్తి, ఎస్.సుమిత్ర, టి.వినోదరావు, అకడమిక్ డీన్ ఎం.వి.ఆర్.రాజు, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన సెనేట్ హాలులో మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు మణిహారంలాంటి ఏయూను దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి బాధ్యతను ఏయూ తీసుకుంటుందన్నారు.
ఉద్దానం మూత్రపిండాల సమస్య, విశాఖపట్నంలో కాలుష్యం తీవ్రతలపై ఏయూ దృష్టి పెడుతుందన్నారు. ఏయూ కేవలం విద్య ఒక్కటే కాకుండా సామాజిక అభివృద్ధిలో పాలుపంచుకుంటుందని చెప్పారు.
ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ గత నాలుగైదేళ్లలో రిక్రూట్మెంట్ విధానంలో సమస్యలు వచ్చాయన్నారు. ప్రభుత్వ పరంగా వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
అవసరమైతే గెస్ట్ ఫ్యాకల్టీని నియమిస్తామన్నారు. వర్సిటీకి నిధుల కొరత ఉందన్నారు. పసుపు-కుంకుమ కింద వెళ్లిపోయిన నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
పేద విద్యార్థులకు ఏయూ అండగా నిలుస్తుందన్నారు. బలహీన వర్గాలకు 50శాతం అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
ఫ్లెక్సీ సంస్కృతికి చెక్……
ఈనాడు, విశాఖపట్నం: ఆంధ్రవిశ్వవిద్యాలయానికి అదనపు బాధ్యతలతో వీసీగా నియమితులైన ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి ఫ్లెక్సీలు కట్టడంపై నిషేధం విధించారు.
వర్సిటీలో ప్రతి కార్యక్రమానికి భారీఎత్తున ఫెక్సీలు కట్టే సంస్కృతి ఇటీవల బాగా పెరిగిపోయింది. తనకు అభినందనలు చెబుతూ వర్సిటీలో ఎక్కడా ఫ్లెక్సీలు కట్టొద్దని, అది డబ్బు వృథా ప్రక్రియే కాకుండా పర్యావరణానికి హాని చేస్తుందని స్పష్టంగా చెప్పారు.
కొన్ని సందర్భాల్లో అవి వివాదాలకు కూడా దారితీస్తున్నాయన్నారు. ఈ విషయం తెలియని కొందరు గురువారం రాత్రి ఫ్లెక్సీలు కట్టడానికి ప్రయత్నిస్తుండగా వర్సిటీ ఉద్యోగులు నిరోధించారు.
బాధ్యతలు స్వీకరించడానికి ఆచార్య ప్రసాదరెడ్డి ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా వచ్చారు.
బోధనేతర సంఘం.. : వీసీ ప్రసాదరెడ్డిని శుక్రవారం మధ్యాహ్నం ఏయూ బోధనేతర సంఘం అధ్యక్షుడు గుంటుబోయిన రవికుమార్ ఆధ్వర్యంలో కార్యదర్శి పి.అప్పలరాజు, యనమరెడ్డి, రమణ, పాత్రుడు, తదితరులు కలిశారు.
పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు
●*తాను రిజిస్ట్రార్‌గా ఉన్నపుడు వీసీగా చేసిన ఆచార్య బీలా సత్యనారాయణను ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచారు. బాధ్యతల స్వీకరణ సమయంలోనూ, విలేకరుల సమావేశంలోనూ ఆయన పక్కనే ఉండడం విశేషం.