జేఈఈ మెయిన్ ర్యాంకుల్ని ప్రకటించిన ఎన్టీఏ

జేఈఈ మెయిన్ ర్యాంకుల్ని ప్రకటించిన ఎన్టీఏ
జేఈఈ మెయిన్ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. మొదటి 10 ర్యాంకుల్లో ముగ్గురు, తొలి 24 ర్యాంకుల్లో ఆరుగురు ఏపీ, తెలంగాణ విద్యార్థులున్నారు.
మొదటి 100 ర్యాంకుల్లో 40 మంది వరకు తెలుగు రాష్ట్రాల వారే ఉండటం గమనార్హం. గత ఏడాది మొదటి 15 ర్యాంకుల్లో ఏడుగురు స్థానం దక్కించుకున్నారు.
ఒకటీ, రెండు ర్యాంకులు తెలుగు రాష్ట్రాలకే దక్కగా ఈసారి ఏపీ, తెలంగాణ నుంచి ఉత్తమ ర్యాంకు అయిదుతో ప్రారంభమైంది. జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు దిల్లీకి చెందిన సుభాన్ శ్రీవాత్సవ దక్కించుకున్నారు.
2వ ర్యాంకు కర్ణాటక, 3వ ర్యాంకు మధ్యప్రదేశ్ విద్యార్థి సొంతం చేసుకున్నారు. జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఫలితాలను ప్రకటించింది.
జనవరి, ఏప్రిల్‌లో జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షల్లో వచ్చిన స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకుల్ని కేటాయించింది. రెండు పరీక్షలకు 11.47 లక్షల మంది హాజరయ్యారు.
వారిలో 2.45 లక్షల మందిని మే 27వ తేదీన జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి అర్హులుగా ప్రకటించారు. అందుకు జనరల్ కేటగిరీ విద్యార్థులకు 89.7548849 స్కోర్( 100 ఎన్టీఏ స్కోరుకు)ను కటాఫ్‌గా పరిగణించింది.
ఆయా సామాజిక విభాగాలను బట్టి కటాఫ్ స్కోర్ నిర్ణయించారు. గత ఏడాది జనరల్ కేటగిరీకి కటాఫ్ మార్కులు 74 మాత్రమే ఉండగా ఈసారి అది 89.75. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్)వారికి రిజర్వేషన్ ప్రకటించిన నేపథ్యంలో ఈసారి వారికి కూడా కటాఫ్ నిర్ణయించారు.
ఇంటర్ చదివిన ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోవడం వల్ల కొందరు ఏపీకి చెందిన ర్యాంకర్లను కూడా తెలంగాణకు చెందిన వారిగా ఎన్టీఏ ప్రకటించింది. గత జనవరిలో ఉత్తమ స్కోర్ సాధించిన వారే ఈసారి ర్యాంకుల్లో కూడా అగ్రస్థానంలో నిలిచారు.
ఎదురుచూపులు
జేఈఈ మెయిన్ ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని సోమవారం లక్షల మంది ఎదురుచూశారు. ఫలితాలు ఏ సమయంలో ప్రకటిస్తామో ఎన్టీఏ చెప్పకపోయినప్పటికీ సాయంత్రం 6 గంటల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూశారు.
మొదట తుది కీ ఇచ్చారు. ఆ తర్వాత ఫలితాలను ప్రకటించారు. ఒక్కసారిగా లక్షల మంది విద్యార్థులు ఫలితాలు చూసుకోవడంతో ఎన్టీఏ సర్వర్ డౌన్ అయింది.