News

Realestate News

వీవీప్యాట్‌ స్లిప్పులను ముందే లెక్కించాలి

Amount should be calculated between VVP EVMs.


వీవీప్యాట్‌ స్లిప్పులను ముందే లెక్కించాలి

వీవీప్యాట్‌, ఈవీఎంల మధ్య  తేడాలొస్తే మొత్తం లెక్కించాలి

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈవీఎంల కంటే ముందే వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో అత్యవసరంగా ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.

వీవీప్యాట్‌ స్లిప్పులు, ఈవీఎంల మధ్య ఓట్ల సంఖ్యలో తేడా వచ్చిన సందర్భంలో ఆయా అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని అన్ని వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది బాలాజీ యలమంజుల ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌, జస్టిస్‌ కె.విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరపనుంది.
ఈవీఎంల చివరి రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక అయిదు వీవీప్యాట్‌ల స్లిప్పులను లెక్కించడానికి బదులు ప్రారంభంలోనే స్లిప్పులను లెక్కించేలా ఆదేశించాలని పిటీషనర్‌ వ్యాజ్యంలో కోరారు.

ఈవీఎంల లెక్కింపు తర్వాత ఏ అభ్యర్థికి అత్యధిక ఓట్లు వచ్చాయో తెలిసిపోతుందని, ఆ తర్వాత వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించడం వల్ల ఉపయోగం లేకపోగా, వివాదాలకు తావిస్తుందన్నారు.

చివర్లో వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించడం ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. తాము వేసిన ఓట్లను ఈవీఎంలు సక్రమంగానే నమోదు చేశాయా? లేదా? అనేదానిపై ప్రజల్లో సందేహాలున్నాయన్నారు.

ఈ నేపథ్యంలో వీవీప్యాట్‌ స్లిప్పులు, ఈవీఎంల మధ్య తేడాలొస్తే అన్ని స్లిప్పులను లెక్కించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం(ఈసీ)పై ఉందన్నారు.

వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈసీ ఇప్పటి వరకు తగిన ఉత్తర్వులు జారీచేయలేదన్నారు. వెబ్‌సైట్లో సైతం వివరాల్ని ఉంచలేదన్నారు.

ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ఈవీఎంల లెక్కింపునకు ముందే వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించేలా ఆదేశించాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌, ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.