News

Realestate News

సీతమ్మధార ఉపఖజానాలో పింఛనుదారుల సర్దుబాటు

Adjustment Pensioners Seethamadhara Subhakhana.

సీతమ్మధార ఉపఖజానాలో పింఛనుదారుల సర్దుబాటు

 

 

మాట్లాడుతున్న ట్రెజరీ శాఖ సంచాలకులు హనుమంతురావు,
చిత్రంలో జిల్లా ట్రెజరీ శాఖ డీడీ శివరామప్రసాద్‌

 

నగర పరిధిలో ఉండే ప్రభుత్వ పింఛనుదారులకు మెరుగైన సేవలందించేందుకు మరో రెండు ఉప ఖజానా కార్యాలయాలను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లు ట్రెజరీ శాఖ రాష్ట్ర సంచాలకులు బీఎల్‌ హనుమంతురావు తెలిపారు.

రెండు రోజుల పర్యటన కోసం విశాఖకు వచ్చిన ఆయన గురువారం కలెక్టరేట్‌ భవన సముదాయంలోని జిల్లా ఖజానా కార్యాలయాన్ని సందర్శించారు.

జిల్లాలోని ఉపఖజానా అధికారులతో సమావేశం అయ్యారు. ఖజానాలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులతో శాఖాపరమైన అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా విలేకర్లతో హనుమంతురావు మాట్లాడుతూ సీతమ్మధారలో ఉన్న ఉప ఖజానా ద్వారా నగర పరిధిలోని 16,500 మంది పింఛనుదారులకు సేవలందిస్తున్నామన్నారు.

దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. పింఛనుదారుల సంఖ్య అధికం కావడం వల్ల తప్పిదాలకు, పునఃసమీక్షకు ఇబ్బందికరంగా మారుతోందన్నారు.

ఈ ఇబ్బందులను తప్పించేందుకు అదనంగా మరో రెండు ఉప ఖజానా కార్యాలయాలను విశాఖకు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.

గాజువాక, మధురవాడ కేంద్రాలుగా కొత్త ఉప ఖజానా కార్యాలయాలు రాబోతున్నాయని, జులై నెలాఖరుకు వీటిని అందుబాటులోకి తెస్తామన్నారు. ఇప్పటికే అనువైన భవనాలను గుర్తించామన్నారు.

సర్దుబాటుకు చర్యలు

సీతమ్మధార ఉప ఖజానాలో ఉన్న మొత్తం పింఛనుదారుల్లో మధురవాడ, గాజువాక ఉప ఖజానాలకు చెరో 5వేల మంది పింఛనుదారులను సర్దుబాటు చేస్తామని, మిగతా 6,500 మంది పింఛనుదారులు సీతమ్మధారలో ఉంటారని హనుమంతురావు చెప్పారు.

పింఛనుదారుల చిరునామాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని సర్దుబాటు చేస్తామన్నారు. తొలి దశలో కొత్తగా ఏర్పాటు చేసే ఉప ఖజానాల ద్వారా పింఛన్లు జారీ చేస్తామని, మలిదశలో ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగిస్తామని చెప్పారు.

వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లాకు రావడం జరిగిందని, ప్రభుత్వ పరంగా అమలవుతున్న కార్యక్రమాలు, జమ, ఖర్చులు, సీఎఫ్‌ఎంఎస్‌ పనితీరు తదితర అంశాలపై సమీక్షించినట్లు హనుమంతురావు వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఖజానా శాఖ డీడీ శివరామప్రసాద్‌ పాల్గొన్నారు.