News

Realestate News

జడ్పీ ఛైర్‌పర్సన్‌కు ఆత్మీయ వీడ్కోలు


జడ్పీ ఛైర్‌పర్సన్‌కు ఆత్మీయ వీడ్కోలు

ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ నియామకం

జడ్పీ ఛైర్‌పర్సన్‌ లాలం భవాని దంపతులకు ఆత్మీయ సత్కారం చేస్తున్న జడ్పీ సీఈవో
రమణమూర్తి, డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు తదితరులు 

 జిల్లాపరిషత్తు పాలకవర్గం పదవీకాలం ముగిసిన సందర్భంగా ఆఖరిరోజున జడ్పీ ఉద్యోగులందరికీ ఛైర్‌పర్సన్‌ లాలం భవాని తేనేటి విందు ఏర్పాటు చేశారు.

అయిదేళ్లలో ఉద్యోగులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. మీరంతా సహకరించడం వల్లే అందరూ గుర్తుంచుకునే విధంగా పాలన అందించగలిగానని అన్నారు.

ఛైర్‌పర్సన్‌ దంపతులు లాలం భవాని, భాస్కరరావులను ఉద్యోగులంతా శాలువాలతో సత్కరించారు. సీఈవో రమణమూర్తి మాట్లాడుతూ జిల్లా పరిషత్తు కార్యాలయాన్ని కార్పొరేట్‌ కార్యాలయాలకు దీటుగా తీర్చిదిద్దిన ఘనత ఛైర్‌పర్సన్‌కే దక్కుతుందన్నారు.

ఉద్యోగుల సంక్షేమానికి ఎంతో సహకరించారని గుర్తుచేశారు. అనంతరం జడ్పీ ఉద్యోగులంతా కార్యాలయ ఆవరణ దాటే వరకు వెంటనడిచి ఆత్మీయ వీడ్కోలు పలికారు.

ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌

జడ్పీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ను నియమిస్తూ గురువారం ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీచేశారు.

శుక్రవారం నుంచి జడ్పీలో పాలనాపరమైన అంశాలన్నీ కలెక్టర్‌ పరిధిలోకి రానున్నాయి. జిల్లా పరిషత్తు పరిధిలోని ఉద్యోగుల బదిలీలు కూడా కలెక్టర్‌ ఆమోదంతోనే జరగాల్సి ఉంటుంది.

కొత్త పాలకవర్గం ఎన్నికయ్యే వరకు జడ్పీ ద్వారా జరిపే పనులకు, నిధుల కేటాయింపులకు కలెక్టర్‌ అనుమతితోనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఏడాది క్రితం పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనకు వెళ్లాయి.

మూడు రోజుల క్రితం పురపాలక సంఘాలకు, రెండు రోజుల క్రితం మండల పరిషత్తులకు ప్రత్యేకాధికారులను నియమించారు.