ఆంధ్ర వైద్య కళాశాలలో పెరగనున్న 50 సీట్లు

ఆంధ్ర వైద్య కళాశాలలో పెరగనున్న 50 సీట్లు
ఆంధ్ర వైద్య కళాశాల
ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు 50 వరకు పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈబీసీలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించింది. వీటిని అమలు చేయాల్సి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో 650 వరకూ సీట్లు పెరగనున్నాయి.
ఈ క్రమంలో ఆంధ్ర వైద్యకళాశాలకు అదనంగా 50 సీట్లు మంజూరు అయ్యాయి. ప్రస్తుతం 200 సీట్లు ఉన్నాయి. తాజా పెంపుతో ఇవి 250కు చేరనున్నాయి.
33 సీట్ల నుంచి మొదలై…
1923లో స్థాపితమైన ఆంధ్ర వైద్యకళాశాల దేశంలోనే అతిపురాతన మెడికల్ కాలేజీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. 33 సీట్లతో మొదలైన ఏఎంసీ ప్రస్థానం క్రమంగా పెరుగుతూ వచ్చింది.
మూడేళ్ల క్రితం సీట్ల సంఖ్య 200కు పెరగగా, తాజాగా 250 సీట్లకు చేరనుంది. పెరిగిన సీట్లను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే భర్తీ చేయనున్నారు.
రాష్ట్రంలో ఆంధ్ర వైద్యకళాశాలకు బోధనాపరంగా మంచి గుర్తింపు ఉంది. వెయ్యిలోపు ర్యాంకులు సాధించిన వారిలో అత్యధికులు ఏఎంసీలో చేరేందుకు మక్కువ చూపుతున్నారు.
సదుపాయాలపై ఆందోళన
ఏఎంసీలో సీట్లు పెరుగుదల మంచి పరిణామమే అయినప్పటికీ అందుకు తగ్గట్టుగా వసతులు లేకపోవడం కళాశాల వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. వైద్యకళాశాలలో 213 పీజీ సీట్లు ఉన్నాయి. మరో 24 సూపర్ స్పెషాలిటీ సీట్లు ఉన్నాయి.
ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 250కు చేరింది. వైద్య విద్యార్థులు, జూనియర్ వైద్యులతో పాటు పారా మెడికల్ కోర్సులను కలుపుకొంటే ఏటా 2 వేల మందికి పైగా విద్యార్థులు వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారు. వీరికి తగ్గట్టుగా వసతులు ప్రస్తుతం లేవు. లెక్చర్ హాళ్లు, వసతిగృహాల లేమి, గ్రంథాలయం వంటి సమస్యలు ఇక్కడ ఎదురవుతున్నాయి
. వైద్య విద్యార్థులందరికీ వసతి కల్పించలేని పరిస్థితి. అత్యధిక శాతం మంది వైద్యులు కళాశాల చుట్టుపక్కల ఇళ్లను అద్దెకు తీసుకొని ఉంటున్నారు.
వేల సంఖ్యలో విద్యార్థులుంటే 300 మంది వరకు మాత్రమే వసతి కల్పించే సదుపాయాలు ఉన్నాయి. సీట్ల సంఖ్యతో పాటు వసతులు పెంచాలని వైద్యకళాశాల వర్గాలు కోరుతున్నాయి.