400 హెక్టార్లలో మొక్కల పెంపకం

దేవరాపల్లి, న్యూస్టుడే: ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి సగ భూభాగంలో మొక్కలుండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్యేయంగా పెట్టుకున్నారని… వనం-మనం కార్యకమ్రంలో దానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని విశాఖ డివిజన్ అటవీ శాఖాధికారి బి.ధనుంజయరావు స్పష్టం చేశారు. ఆయన సోమవారం దేవరాపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ముందస్తుగా హుద్హుద్లో జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో హుద్హుద్కి ముందు 43 శాతం అటవీ ప్రాంతం ఉండేదని… తుపాను ప్రభావంతో అటవీప్రాంతం చాలా వరకు దెబ్బతిందన్నారు. 2020 నాటికి అడవులు యథాస్థితికి చేరేవిధంగా గత ఏడాది అటవీ ప్రాంతంలో 400 హెక్టార్లలో మొక్కలు నాటామన్నారు. ఈ ఏడాది మరో 400 హెక్టార్లలో మొక్కలు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వన సంరక్షణ సమితుల ద్వారా భూసార పరిరక్షణ పనులు చేపడుతున్నామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గత ఏడాది 25 లక్షల మొక్కలను నర్సరీల్లో పెంచామన్నారు. వాటిలో 4 లక్షల మొక్కలను ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో నాటామని తెలిపారు. 20 శాతం మొక్కలను ప్రజలకు అందజేశామన్నారు. జిల్లాలో 50 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరుపక్కలా మొక్కలు నాటాలని నిర్ణయించామని చెప్పారు. ఈ ఏడాది కూడా పాఠశాలల నర్సరీల్లో 25 లక్షల మొక్కలు పెంచడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతినెలలో 4వ శనివారం పిల్లలకు క్షేత్రస్థాయిలో అటవీ ప్రాంతాన్ని చూపించడానికి తీసుకువెళ్తామని తెలిపారు. దీనివల్ల పర్యావరణ పరిరక్షణపై విద్యార్థి దశ నుంచే వారికి అవగాహన పెంచడానికి వీలు కలుగుతుందన్నారు. డీఎఫ్ఓ వెంట చోడవరం రేంజర్ శ్రీనివాసరావు, దేవరాపల్లి అటవీ అధికారి ఎం.రమేష్ కుమార్, సహాయ బీటు అధికారి రాజా తదితరులున్నారు.