‘బ్రిటన్ ప్రధాని త్వరగా కోలుకోవాలి’
‘బ్రిటన్ ప్రధాని త్వరగా కోలుకోవాలి’

ఆకాంక్షించిన ప్రపంచ దేశాధినేతలు
లండన్: కరోనా వైరస్ సోకి ఐసీయూలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ”బోరిస్ జాన్సన్ అతిత్వరలో ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి బయటకు వస్తారని ఆశిస్తున్నాను” అని ట్వీట్ చేశారు. 10 రోజుల క్రితం బోరిస్ జాన్సన్కు వైరస్ సోకినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. లక్షణాలు అలాగే కొనసాగడంతో ఆదివారం ఆస్పత్రిలో చేర్చారు.
ఇక చికిత్స సమయంలో లక్షణాలు కాస్త తీవ్రం కావడంతో సోమవారం ఐసీయూకి తరలించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు వేలాది మంది ప్రాణాల్ని బలిగొంటున్న ఈ మహమ్మారి ఇప్పుడు ఏకంగా ఓ దేశాధినేతనే తీవ్ర అనారోగ్యానికి గురి చేయడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దేశాధినేతలు జాన్సన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అమెరికా ప్రజలంతా బోరిస్ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ క్రమంలో బ్రిటన్ ప్రభుత్వానికి అన్ని రకాలు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధానోమ్ సైతం బోరిస్ ఆరోగ్యంపై వాకబు చేశారు. అతిత్వరలో కోలుకొని విధుల్లో చేరతారని ఆకాంక్షించారు.
ఇవీ చదవండి..