News

Realestate News

గిరి ప్రదక్షిణకు అడ్డంకులు తొలగించారు

గిరి ప్రదక్షిణకు అడ్డంకులు తొలగించారు
కార్పొరేషన్‌, మాధవధార న్యూస్‌టుడే: గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా జీవీఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ‘‘దారి పొడవునా ఆటంకాలే’’ శీర్షికతో బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు వెంటనే ఉపశమన చర్యలు చేపట్టారు. ప్రధాన ఇంజినీరు దుర్గాప్రసాద్‌ ఆదేశాల మేరకు మాధవధార రహదారికి ఇరువైపులా భక్తులకు ఇబ్బందిగా ఉన్న పైపులను తొలగించారు. సీతమ్మధార నుంచి ఆర్‌అండ్‌బీ వరకూ ఉన్న మార్గంలో రహదారిపై ఊడిన పెచ్చులను, రాళ్లను అధికారులు కూలీలతో తొలగించారు. బుధవారం ఉదయం నుంచి మరమ్మతు పనులు ప్రారంభించిన సిబ్బంది గోతులను పూడ్చివేశారు. భూగర్భ మురుగునీటి వ్యవస్థ కోసం తీసిన గోతులను పూడ్చి నడవడానికి అనుకూలంగా చేశారు. నరసింహనగర్‌ రహదారి నుంచి కైలాసపురం బస్టాపు వరకూ వీధి దీపాలు లేకపోవడంతో భక్తులు పడే ఇబ్బందులను పర్యవేక్షక ఇంజినీరు పల్లంరాజు దృష్టికి తీసుకెళ్లగా, శాశ్వతంగా దీపాలు ఏర్పాటు చేయడానికి పోర్టు నుంచి అనుమతుల్లేవని గిరి ప్రదక్షిణ భక్తులకు ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేస్తామన్నారు. బుధవారం సాయంత్రం నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు. పోర్టు పాఠశాల వద్ద ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలను పారిశుద్ధ్య కార్మికులతో తొలగించామని, రహదారికి ఐదు మీటర్ల దూరం వరకు ఇరువైపులా పిచ్చిమొక్కలు, గడ్డిని తీసేసినట్లు ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ హేమంత్‌కుమార్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

విధుల్లో 700 మంది కార్మికులు…
గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు వేసే చెత్తను తొలగించడానికి అనువుగా 700 మంది కార్మికులు పారిశుద్ధ్య పనులు నిర్వహించనున్నారని ప్రధాన వైద్యాధికారి తెలిపారు. ప్రదక్షిణ ముగిసిన గంటన్నరలోగా ఏ ప్రాంతంలోనూ చెత్త ఉండకుండా శుభ్రం చేస్తామని, ప్రతి ఏటా కార్మికులు అదే విధంగా పనిచేస్తున్నారని తెలిపారు. కాగితంతో తయారు చేసే గ్లాసులతోనే మంచినీటిని అందించడానికి జీవీఎంసీ ఏర్పాట్లు చేసిందని, మొత్తం 15 ప్రాంతాల్లో నీటిని అందిస్తామన్నారు. సింహాచలం దేవస్థానం, స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే మంచినీటి ప్యాకెట్లు సరఫరా చేస్తాయని, వాటిని తొలగించి, డంపింగ్‌యార్డుకు తరలిస్తామని పేర్కొన్నారు. పర్యావరణానికి ఎలాంటి నష్టం జరుగకుండా జాగ్రత్తపడతామన్నారు.