News

Realestate News

మూడో లైన్‌తో మూడు రెట్ల ఆదాయం

మూడో లైన్‌తో మూడు రెట్ల ఆదాయం
ముమ్మరంగా వంతెనల నిర్మాణ పనులు
రైళ్లలో సరకు రవాణా మున్ముందు సులువే..
ఎలమంచిలి, న్యూస్‌టుడే
త్యధికంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే సరకుల రవాణాను వేగవంతం చేయడానికి రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. రవాణాలో ఆలస్యాన్ని తగ్గించి పచ్చిసరకును సైతం సకాలంలో గమ్యం చేర్చడానికి వీలుగా ప్రత్యేకంగా మూడో రైల్వే లైన్‌ వేస్తోంది. దువ్వాడ – విజయవాడల మధ్య రూ.3873 కోట్లతో ఈ పనులు చేపట్టింది. విశాఖ జిల్లాలో ఈ మూడోలైన్‌ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ముందుగా వంతెన నిర్మాణ పనులు ప్రారంభిచారు. జిల్లాలో 36 చోట్ల వంతెనలు నిర్మించాలని అంచనావేసి పనులు చేపట్టారు. రైలు మార్గం వేయడానికి మట్టితో రోడ్డు వేస్తున్నారు. 335 కిలోమీటర్ల పొడవున మూడో రైలు మార్గం వేస్తున్నామని రైల్వే శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

గతంతో పోలిస్తే రైళ్ల సంఖ్య బాగా పెరిగింది. పదేళ్ల కిందట రోజుకి రానుపోను 90 రైళ్లు కూడా తిరిగేవికావు. ఇప్పుడు రోజుకి 186 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో గూడ్స్‌ రైళ్ల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. అయితే పూర్వం వేసిన రెండు ప్రధాన లైన్లే ఇప్పటికీ ఉన్నాయి. రైళ్ల సంఖ్య పెరిగినా రైలు మార్గాలు పెరక్కపోవడం వల్ల రద్దీ బాగా పెరిగింది. గూడ్స్‌ రైలు విశాఖలో బయలుదేరి విజయవాడ వెళ్లాలంటే మధ్యలో లైన్‌ ఖాళీలేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు లైన్‌ క్లియర్‌.. చేయడానికి ఎక్కడపడితే అక్కడ ఆపేస్తున్నారు. ఫలితంగా 8 గంటల్లో గమ్యం చేరాల్సిన గూడ్సు రైలుకు 24 గంటలు కూడా పడుతోంది. విశాఖలో ఓడరేవు ఉండటంతో ఇక్కడి నుంచి సరకుల రవాణా బాగా ఎక్కువగా ఉంటుంది. సిమెంట్‌ కర్మాగారాలు రైళ్ల ద్వారానే ఉత్పత్తిని ఎగుమతి చేస్తున్నాయి. కార్లు, లారీలు, బస్సులు, చివరికి ఎండుగడ్డి సైతం రైళ్లలోనే రవాణా చేస్తున్నారు. గూడ్స్‌రైలు గమ్యం ఎప్పుడు చేరుతుందో తెలియక పచ్చి సరకును రవాణా చేయడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. మూడు జిల్లాల నుంచి మామిడి, తమలపాకు, కూరగాయలు, పళ్లు, పాలు, ఇతర పచ్చి సరకులు రైలులో రవాణా చేస్తే చాల తక్కువ ఖర్చుతో గమ్యం చేరతాయి. అయితే సకాలంలో గమ్యం చేరకపోతే సరకు పాడైపోతుందని వ్యాపారులకు భయం. దీంతో ఖర్చు ఎక్కువైనా రోడ్డు మార్గంలో వీటిని ఎగుమతి, దిగుమతులు చేస్తున్నారు. ఇలాంటి వ్యాపారులను సైతం ఆకట్టుకోవడానికి గూడ్స్‌రైళ్ల కోసం ప్రత్యేకంగా మూడో లైన్‌ వేస్తున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీనివల్ల ఆదాయం పెరగడంతోపాటు వ్యాపారులకు తక్కువ ధరలకే సరకులు గమ్యం చేరతాయి. రవాణా ఖర్చులు తగ్గితే సరకులు ధరలు కూడా మార్కెట్‌లో తగ్గుతాయి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, క్యాబేజీ లాంటివి  రవాణాకి కొనుగోలు ధరలో సగం ధర రవాణాకే అవుతోంది. కేజీ టమోటా రైతుల వద్ద రూ. 10కి కొంటే వినియోగదారుడికి చేరే సరికి అన్ని ఖర్చులూ కలిపి రూ.40కి విక్రయిస్తున్నారు. ఇలాంటి సమస్యలు నివారించేందుకు ప్రధాన ఓడరేవులున్న విశాఖపట్నం ప్రాంతాన్ని కలుపుతూ కొత్తగా మూడో లైన్‌ వేయాలన్న ఆలోచనలో రైల్వే శాఖ ఉంది. దశల వారీగా దీన్ని చేపట్టనున్నారు. ముందుగా దువ్వాడ, విజయవాడల మధ్య పనులు ప్రారంభించారు. ఈ మూడో లైన్‌లో సరకు రవాణా రైళ్లకు ప్రాధాన్యం ఇస్తారు.

రైల్వే శాఖకు ప్రయాణికుల రైళ్లు నడపడం వల్ల ఖర్చులు రావడం మినహా అదనపు ఆదాయం ఉండదు. సరకుల రవాణా ద్వారానే పుష్కలంగా ఆదాయం వస్తుంది. విశాఖ జిల్లాలోని ఎలమంచిలి, కశింకోట మండలాల్లో ఉన్న సిమెంట్‌ కర్మాగారాల ద్వారా ఏడాది రైల్వేకి రూ.100 కోట్లపైన ఆదాయం వస్తోంది. అలాగే సరుగుడు కర్ర, ఉప్పు, జిప్సం, ఎరువులు, బొగ్గు, ఇనుము, ఐరన్‌ఓర్‌, ఆయిల్‌, పశుగ్రాసం, వాహనాలు,  తదితర సరకుల రవాణా ద్వారా ఏటా రూ. వేల కోట్ల ఆదాయం పొందుతోంది. విశాఖ నుంచి ఏటా సరకుల రవాణా ద్వారా రూ.5 వేల కోట్ల వరకూ ఆదాయం వస్తోందని అంచనా. మూడో లైన్‌ వేస్తే ఈ ఆదాయం మరో మూడు రెట్లు పెరుగుతుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా వంతెనలు నిర్మిస్తున్నారు మట్టితో మూడో లైన్‌కి మార్గం వేస్తున్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గూడూరు మార్గంలో రద్దీని తగ్గించడానికి ఈ మూడో రైల్వే మార్గం వేస్తున్నారు. ఈ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఎలమంచిలి సమీపంలో రెండు వంతెనలు నిర్మాణంలో ఉన్నాయి. రైల్వేలైన్‌కి ఇరువైపులా తగినంత స్థలాన్ని ముందుగానే సేకరించి ఉంచడం వల్ల భూసేకరణ అవసరం లేకుండాపోయింది.