కశింకోట, న్యూస్‌టుడే: విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో అనకాపల్లి నియోజకవర్గంలో రూ.49 కోట్లతో పలు అభివృద్ధి పనులు జరిగాయని శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. డెయిరీ ఛైర్మన్ ఆడారి తులసీరావు 19 కల్యాణ మండపాలు, 5 వంతెనలు, 400 బోర్లు, సత్యనారాయణమూర్తి దేవస్థానం రహదారి, చెరకాంలో తులసీ జలశాయం నిర్మాణాలతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేశారన్నారు. మండలంలోని పేరంటాలపాలెంలో రూ.19.50లక్షలు, బుచ్చెయ్యపేటలో రూ.33.50లక్షల వ్యయంతో నిర్మించిన తులసి కల్యాణ మండపాలను గురువారం ఐకాన్ ఆసుపత్రి సీఈవో ఆడారి ఆనంద్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డెయిరీ డైరెక్టరు, ఆర్ఈసీఎస్ పర్సన్ ఇన్ఛార్జ్ మలసాల రమణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేరంటాలపాలెం కాలువ వద్ద రక్షణగోడ నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పలు పథకాలను అమలుచేసిన ఘనత ఛైర్మన్ తులసీరావుదేనన్నారు. సీఈవో ఆనంద్ మాట్లాడుతూ పాడిపశువులకు అవసరమైనచోట్ల షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. అధిక పాల ఉత్పత్తికి దాణా అందజేయనున్నట్లు తెలిపారు. ఎంపీపీ పంచదార్ల లక్ష్మి, డీసీసీబీ డైరెక్టరు సిదిరెడ్డి శ్రీనివాసరావు, పాల సంఘం అధ్యక్షులు కేసినశెట్టి గోవింద, బుదిరెడ్డి రామారావు, తెదేపా నాయకులు పంచదార్ల సూరిబాబు, వేగి గోపీకృష్ణ, పెంటకోట రాము, అందె రమణ, సర్పంచులు బండారు రామారావు, మలపురెడ్డి సత్యవతి, మాజీ సర్పంచి పువ్వల నారాయణమ్మ, డెయిరీ అధికారులు పాల్గొన్నారు.