News

Realestate News

మహాయజ్ఞంలో మరో ముందడుగు

మహాయజ్ఞంలో మరో ముందడుగు
వంశధార-మహేంద్రతనయ-బాహుదా అనుసంధానం దిశగా కార్యాచరణ
సమగ్ర ప్రాజెక్టు నివేదిక టెండర్లు ఖరారు
అర్హతలను కుదించడంతోనే సాధ్యమైంది
ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈలోపే అంచనాలు పూర్తికావాలి. టెండర్లు పిలవాలి. పనులు మొదలెట్టాలి. ఇవన్నీ  సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) టెండర్లతోనే ముడిపడి ఉన్నాయి. అర్హతలు ఉన్న సంస్థలు రాలేదని టెండర్లు వాయిదా వేస్తూ వెళితే ఎలా? ఇదే అంశంపై  గట్టిగా అడగాల్సి వచ్చింది. విదేశీ సంస్థలు ఏవీ ఈ పనులు చేసేందుకు రావు కదా! ఉన్నవాటితోనే సర్దుబాటు చేసుకోకపోతే ఎప్పటికీ ‘డీపీఆర్‌’ కొలిక్కిరాదు. మొదటిసారి అర్హమైన సంస్థలు రాకుంటే.. ప్రమాణాలను సగానికి కుదించి టెండర్లు పిలిపిస్తానని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా మాటిచ్చారు. సీవోటీ టెండర్లను ఆమోదించడం లాంఛనమే. జూన్‌ నెలాఖరుకల్లా డీపీఆర్‌ చేతికందితే.. ఆ వెంటనే అంచనాలు వేసి.. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఉన్నాం.

– కింజరాపు అచ్చెన్నాయుడు, రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి

వంశధార నదిని… మహేంద్రతనయ, బాహుదా నదులతో అనుసంధానించే మరో బృహత్తర పథకానికి తొలి అడుగు పడింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపకల్పన ప్రక్రియలో టెండర్ల దశను జలవనరుల శాఖ అధిగమించింది. తొలిసారి పిలిచిన టెండర్లలో అనర్హ సంస్థలు రావడంతో తిరిగి రెండోసారి టెండర్లు పిలిచి ఒక్కమాసంలోనే ముందడుగేసేంది. ఈ సారి టెండర్లు దాఖలు చేసిన మూడు సంస్థలు అర్హత సాధించడంతో వాటిలో అతి తక్కువ మొత్తాన్ని పేర్కొన్న ‘కాంటెక్‌ డిజైన్స్‌, ఇంజినీరింగు సొల్యూషన్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌’ సంస్థ  టెండరును దక్కించుకుంది. మూడు మాసాల వ్యవధిలోనే ఈ సంస్థ డీపీఆర్‌ రూపకల్పన చేసి సమర్పించాల్సి ఉంది. ఆ వెంటనే వయోడక్టుతో సహా నదుల అనుసంధాన పనులకు అంచనాలు రూపుదిద్దుకోనున్నాయి.

తొలిసారి అలా… అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వంశధార – మహేంద్రతనయ – బాహుదా నదుల అనుసంధానాకి సంబంధించి డీపీఆర్‌ రూపకల్పనకు ప్రభుత్వం రూ.2.8 కోట్లకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు జనవరి 26న వంశధార ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయం టెండర్లు పిలిచింది. టెండర్ల దాఖలుకు గడువు ఫిబ్రవరి 19. ఆ రోజు నాటికి రెండు సంస్థలు టెండర్లు  దాఖలు చేశాయి. హైదరాబాదుకు చెందిన ఆర్వీ అసోసియేట్‌ ఆర్కిటెక్‌ ఇంజినీర్స్‌ అండ్‌, కన్సల్టెంట్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, కాంటెక్‌ డిజైన్స్‌ అండ్‌ ఇంజినీరింగు సొల్యూషన్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థలు రెండూ టెండర్లు దాఖలు చేశాయి. 20న సాంకేతిక బిడ్లు తెరిచారు. వాటిలో అర్హత సాధిస్తే.. 24న ప్రైస్‌బిడ్‌ తెరవాలి. సాంకేతిక బిడ్లను తెరిచి విశ్లేషించేసరికి.. జలవనరుల శాఖ పేర్కొన్న అర్హతలేవీ ఆ రెండు గుత్తేదారు సంస్థలకు లేనట్లు తేటతెల్లం అయింది. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు దాఖలు చేసిన ప్రైస్‌బిడ్లను కూడా తెరవకుండానే నిలిపేసింది. హైలెవెల్‌ కెనాల్‌ నుంచి వంశదార నది మీదుగా ఏడు కి.మీ. వయోడక్టు నిర్మాణ రూపకల్పన చేసేంత సామర్థ్యం లేవని టెండర్ల దశలోనే జలవనరుల శాఖ తిరస్కరించింది. గతంలో పని చేసిన బోర్డు డేటాలను కూడా పొందుపరచలేకపోవడమూ దానికి తోడైంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నికల నాటికి టెండర్లు పిలిచి పనులు మొదలెట్టాలన్న పట్టుదలతో ఉన్న ప్రభుత్వం జలవనరుల శాఖను పరుగులు పెట్టించింది. అక్కడా వెంటవెంటనే చర్యలు తీసుకున్నారు. వారం తిరిగేసరికి మార్చి 6న రెండోసారి టెండర్లకు పిలుపునిచ్చింది. 20 వరకు దాఖలు చేసుకోడానికి గడువిచ్చింది.

మూడు సంస్థలు.. పోటాపోటీ
సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన టెండర్లలో మూడు సంస్థలు పోటాపోటీగా టెండర్లు దాఖలు చేశాయి. వాటిని విశ్లేషించేసరికి కొంత సమయం పట్టింది. హైదరాబాదుకు చెందిన కాంటెక్‌ డిజైన్స్‌, ఇంజినీరింగు సొల్యూషన్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌ 17.70శాతం తక్కువకు కోట్‌ చేసి ఎల్‌-1గా ఎంపికైంది. అంతకు ముందు టెండర్లు దాఖలు చేసిన రెండు సంస్థల్లో ఒకటి 12.69శాతం తక్కువకు, మరొకటి 1.7శాతం తక్కువకు కోట్‌ చేసి ఎల్‌-1, ఎల్‌-2లుగా ఎంపికయ్యాయి. వీటిలో అతితక్కువ కోట్‌ చేసిన కాంటెక్‌ డిజైన్స్‌ ఇంజినీరింగు సొల్యూషన్స్‌ సంస్థకు టెండరును ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. దీనిపై కమిషనరేట్‌ ఆఫ్‌ టెండర్స్‌ ఆమోదం తీసుకుని ఖరారు చేయాల్సి ఉంది. సమయం బాగా తక్కువ ఉండటంతో.. ఇప్పటికే సదరు సంస్థ రంగంలోకి దిగింది అవసరమైన సమాచారం సమకూర్చుకుంటోంది. వాస్తవానికి తొలిసారి టెండర్లలో ఒక్క సంస్థా అర్హత పొందకపోవడంపై జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు గట్టిగా వాకబు చేశారు. అర్హతలను కుదించకపోతే ఎప్పుడు అంచనాలు రూపొందించి.. ఎప్పుడు పనులు మొదలెడతాం అంటూ ఇంజినీరింగు అధికారులను గట్టిగా ప్రశ్నించారు. రెండోసారి అర్హతలను కుదించడంతో గతంలో టెండర్లు దాఖలు చేసిన రెండింటితో పాటు మరొక సంస్థ కూడా అర్హత సాధించగలిగాయి. ఎలాంటి అడ్డంకులు లేకుండా డీపీఆర్‌ టెండర్ల ప్రక్రియ ముగిసింది.

ముఖ్యమంత్రి చొరవతో
హిరమండలం జలాశయం నుంచి రాష్ట్ర సరిహద్దు నియోజకవర్గం ఇచ్ఛాపురం వరకు సాగునీటిని తీసుకెళ్లేందుకు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఇంజినీరింగు అధికారులు తనముందు చేసిన ప్రతిపాదనలను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆ తరువాత చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడు.. హిరమండలం జలాశయం నుంచి ఇచ్ఛాపురం వరకు కాలువ నిర్మించి 75వేల ఎకరాలకు సాగునీటిని అందించాలన్నది దీని ఉద్దేశంగా అధికారులు  వివరించారు. హిరమండలం జలాశయం నుంచి వంశధార నది పై నుంచి కాలువ తీసుకెళ్లాలంటే.. 7 కి.మీ. పొడవునా వయోడక్టు నిర్మించడమే ఇందులో కీలకం. ఇచ్ఛాపురం వరకు 100కి.మీ. పొడవునా కాలువ నిర్మించాలి. మధ్యలో ఆఫ్‌షోర్‌ జలాశయానికి నీటిని అందించాలి. మహేంద్ర తనయ నదికి అనుసంధానం చేయాలి. మహేంద్రతనయపై అక్విడెక్టు నిర్మించి బాహుదా నదికి అనుసంధానం చేయాలి. వంశధార నదిని మహేంద్రతనయ, బాహుదా నదులతో అనుసంధానం చేసే మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకాకుళం వేదిక అవుతుంది. అనంతర కాలంలో కొందరు ఇంజినీరింగు అధికారులు భారీ వ్యయం అవుతుందంటూ అంతగా సుముఖత చూపకపోయినా.. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకెళ్దాం అంటూ భుజం తట్టారు. ప్రభుత్వం వద్ద అవసరమైన పనిముట్లు లేకపోవడం.. జాప్యం అయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని సమర్థవంతమైన సంస్థలకే డీపీఆర్‌ అప్పగించాలన్న ప్రతిపాదన చేశారు. అదే అదనుగా నిధుల కోసం మంత్రి అచ్చెన్న పట్టువదలకుండా వెంటపడి రూ.2.80కోట్ల పాలనాపరమైన మజూరులో కీలక భూమిక వహించారు.

డీపీఆర్‌ రూపకల్పన అంటే..
హిరమండలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 67 మీటర్లు. జలాశయంలో నీటిమట్టం 60.5 మీ స్థాయిలోనే నీటిని హైలెవెల్‌ కెనాల్‌కు మళ్లించాల్సి ఉంటుంది. జలాశయం నుంచి వంశధార నదిని దాటిస్తే గానీ ఇచ్ఛాపురం వైపు కాలువ నిర్మాణం సాధ్యం కాదు. అంటే.. వంశధార నదిపై దాదాపుగా 7 కి.మీ పొడవునా భారీ వయోడక్టు నిర్మించాల్సి ఉంది. మహేంద్రతనయ, బాహుదా నదులకు అనుసంధానం చేయాలి. వయోడక్టు నిర్మాణాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్మించాల్సి ఉంటుంది. ఎన్ని కానాలతో నిర్మించాలి.. ఎంతెంత లోతున పునాదులు తీయాలి వంటి వివరాలన్నీ డీపీఆర్‌ నిగ్గు తేలుస్తుంది. ఆ 60.5మీ స్థాయిలో కాలువను తీసుకెళ్లడానికి.. సుమారు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని సుమారు అంచనా. మహేంద్రతనయపై కూడా అక్విడెక్టు నిర్మించాల్సి ఉంది. కొండ ప్రాంతాలు.. వాగులు, వంకలను దాటుకుంటూ 100 కి.మీ పొడవునా కాలువను నిర్మించాలి. ఆ స్థాయిలో కాలువను తీసుకెళ్లాలంటే.. ఏఏ ప్రాంతంలో ఏఏ స్థాయిలో లెవెల్స్‌లో వంతెనలు, సైఫన్లు, అక్విడెక్టులు ఇతరత్రా కట్టడాలను నిర్మించాల్సి ఉందనే అంశాలన్నీ డీపీఆర్‌లోనే తేటతెల్లం అవుతాయి.

 

http://www.vizagrealestate.com/

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo