News

Realestate News

250 కి.మీ.ల గాలి వేగాన్ని తట్టుకునేలా…

250 కి.మీ.ల గాలి వేగాన్ని తట్టుకునేలా…
ఈనాడు, విశాఖపట్నం : విశాఖ సాగర తీరంలో నిర్మాణమవుతున్న యుద్ధవిమాన మ్యూజియం భద్రత పరంగా అత్యంత కట్టుదిట్టంగా, సురక్షితంగా ఉండేలా వుడా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. తుపానుల సమయాల్లో గాలి తీవ్రత ప్రత్యేకించి సాగరతీరాల్లో అత్యధికంగా ఉండే అవకాశం ఉన్నందున అలాంటి ముప్పు తలెత్తినప్పుడు కూడా యుద్ధవిమాన మ్యూజియానికి ఎలాంటి హానీ జరగకుండా చర్యలు చేపట్టారు. విశాఖ పర్యాటక సిగలో మరో మణిహారం లాంటి ప్రాజెక్టుగా మారబోతున్న టి.యు.-142 మ్యూజియం భద్రత విపత్తుల సమయాల్లో ప్రశ్నార్థకంగా మారే ముప్పు పొంచి ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. బీచ్‌రోడ్డుకు ఒక పక్క కురుసురా మ్యూజియం ఉండగా మరో పక్క యుద్ధవిమాన మ్యూజియం ఏర్పాటుచేస్తే బాగుంటుందని నిర్ణయించిన విషయం తెలిసిందే. యుద్ధవిమానాన్ని ఏర్పాటుచేయడం వరకు బాగానే ఉందిగానీ అది బీచ్‌రోడ్డులో ప్రయాణించేవారికి కనపడకుండా అడ్డుగోడలు కడుతుండడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. దీంతో వుడా అధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. వాస్తవానికి హుద్‌హద్‌ సమయంలో విశాఖ నగరంలో గాలివేగం 170 కి.మీ.లుగా నమోదైంది. ఈ నేపథ్యంలో ఏవైనా నిర్మాణాలు చేస్తే కనీసం 170 కి.మీ.ల గాలివేగాన్ని తట్టుకునేలా నిర్మించాలి. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న యుద్ధవిమాన మ్యూజియం విపత్తుల సమయాల్లో సైతం చెక్కుచెదరకుండా ఉండాలంటే కనీసం 250కి.మీ.ల గాలివేగాన్ని తట్టుకునేలా నిర్మించాలని తేల్చారు. టి.యు.-142 యుద్ధ విమానం వాస్తవానికి కురుసులా జలాంతర్గామి ఉన్నంత బరువుండదు. పైపెచ్చు యుద్ధవిమానం గాల్లో ప్రయాణించడానికి వీలుగా దాని నిర్మాణం ఉంటుంది. తీవ్రమైన పెనుగాలులు వస్తే ఆ విమానం వూగిసలాడడానికి అవకాశం ఉంటుంది. కురుసురా తరహాలో అడుగుభాగం మొత్తం భూమికి ఆని ఉంచే పరిస్థితి లేకపోవడం, రన్‌వేపై ఆగిఉన్న విమానం తరహాలో టైర్లపైనే దాన్ని నిలిపి ఉంచుతున్న నేపథ్యంలో తీవ్రమైన గాలులకు కూడా కదలకుండా ఉండేలా టి.యు.-142 యుద్ధవిమాన ఇంధన ట్యాంకును ఇసుకతో నింపారు. విమాన కదలికల్ని నిరోధించేలా ఏర్పాట్లు చేశారు. అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ 250 కి.మీ.ల వరకు గాలివేగాన్ని కచ్చితంగా తట్టుకునేందుకుగానూ అధికారులు విమాన మ్యూజియం ముందు భాగంగా పకడ్బందీగా ఫైబర్‌ గ్లాస్‌తో గోడలా నిర్మిస్తున్నారు. ఈ అద్దాల గోడ గాలి తీవ్రతలను విమానం వరకు చేరకుండా అడ్డుపడుతుంది.

తుప్పు పట్టకుండా కాపాడడానికీ గోడే కీలకం….
సముద్రం వైపు నుంచి వీచే గాలుల్లో ఉండే తేమ, ఉప్పదనం కారణంగా విమానం త్వరగా తుప్పుపట్టడానికి అవకాశం ఉంది. గాలి ప్రభావం కొంత వరకైనా నిరోధించాలంటే విమానానికి నేరుగా గాలుల తీవ్రత తగలకుండా గోడ కొంతవరకు నిరోధించి తుప్పు పట్టడాన్ని కొంత వరకు అడ్డుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సుమారు రూ.13కోట్ల వ్యయంతో చేపట్టిన యుద్ధవిమాన మ్యూజియాన్ని అత్యాధునిక సదుపాయాలతో, సందర్శకులు మధురానుభూతి పొందేలా విశిష్ఠ సౌకర్యాల సమాహారంగా తీర్చిదిద్దుతున్నారు. కేవలం మ్యూజియం సందర్శించడమే కాకుండా వాయుసేన, నౌకాదళానికి సంబంధించిన సమాచారాల్ని కూడా ఇవ్వడానికి, నిజంగా యుద్ధవిమానంలో ప్రయాణిస్తున్నామన్న అనుభూతిని కలిగించడానికి వీలుగా సిమ్యులేటర్లను ఏర్పాటుచేస్తున్నారు. ఎరోబ్రిడ్జ్‌, కాఫీషాప్‌, సావనీర్‌ షాప్‌ తదితరాలన్నింటినీ నిర్మిస్తున్నారు. తీవ్ర విపత్తుల సమయాల్లో కూడా ఆయా విభాగాలు ఎలాంటి ముప్పులకు గురికాకుండా ఉండేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.