24 గంటలు.. లబ్ డబ్.. లబ్ డబ్..

24 గంటలు.. లబ్ డబ్.. లబ్ డబ్..
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం
సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంట్‌డౌన్‌లో వారాలు తరిగిపోయాయి.. రోజులు గడిచిపోయాయి.. ఇక మిగిలింది గంటలు.. ఘడియలే. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటరు తీర్పు వెలువడడానికి ఇంకా 24 గంటలు మాత్రమే ఉంది.
లెక్కింపు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల్లోనే కాదు. కార్యకర్తల్లోనూ క్షణక్షణానికి ఉత్కంఠ పెరిగిపోతోంది. పోలింగు అంచనాలు ఒకలా ఉంటే ఎగ్జిట్‌పోల్ ఫలితాలు మరొకలా ఉండడంతో ప్రధాన పక్షాల నేతలు అయోమయానికి గురవుతున్నారు.
అభ్యర్థుల గుండెలు లబ్‌డబ్.. లబ్‌డబ్ అంటూ వేగంగా కొట్టుకుంటున్నాయి. సానుకూల ఫలితాల కోసం ఇష్ట దైవాలను ప్రార్థించుకుంటూ క్షణమొక యుగంలా గడుపుతున్నారు.
జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా 11, భాజపా ఒకటి, వైకాపా మూడు స్థానాల్లో విజయకేతనం ఎగురవేశాయి. అనకాపల్లి, విశాఖపట్నం, అరకు పార్లమెంటు స్థానాలను మూడు పార్టీల నుంచి ముగ్గురు ప్రాతినిధ్యం వహించారు.
తాజా సార్వత్రిక పోరులో ఆ తరహా ఫలితాలు వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో రెండు పార్టీల మధ్యనే పోటీ నెలకొనగా ఈ సారి జనసేన కూడా బరిలో ఉండడంతో త్రిముఖ పోరు సాగింది.
ఈ ముక్కోణపు పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారనేది కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా జనసేన ఏ పార్టీ ఓట్లను చీల్చుతుంది..దానివల్ల ఎవరికి లబ్ధిచేకూరుతుందో అంచనా వేయలేకపోతున్నారు.
అంతిమ ఫలితం తేల్చే ఓట్ల లెక్కింపు సమయం గంటలకు చేరడంతో ప్రస్తుతం సర్వత్రా ఇదే చర్చసాగుతోంది.
లెక్కింపునకు సర్వం సిద్ధం..
ఓట్ల లెక్కింపునకు ఇటు అధికార యంత్రాంగం.. అటు అభ్యర్థులు పూర్తిస్థాయిలో సన్నద్దమై ఉన్నారు. గురువారం ఉదయం మొదలు కానున్న లెక్కింపు పర్వానికి దాదాపు 1800 మంది అధికారులు, సిబ్బంది సిద్ధమై ఉన్నారు.
వీరు ఏ సెగ్మెంట్లో విధులు నిర్వహించేది 22వ తేదీ రాత్రే వారికి తెలియజేస్తారు. మరోవైపు పోలీసు అధికారులు లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 1,215 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.
లెక్కింపు కేంద్రాలకు చేరడానికి అవసరమైన మార్గసూచి (రోడ్ మ్యాప్)ని తయారు చేశారు. మరోవైపు అభ్యర్థులు కూడా కౌంటింగ్ ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లును చేసుకున్నారు.
ఇప్పటికే ఏజెంట్లను నియమించుకున్నారు. లెక్కింపురోజున వారు చేయాల్సిన విధులపైనా అవగాహన కల్పించారు. మంగళవారం నాడే ఏజెంట్ల పాస్‌లను అందజేయడంతో కొందరు ఏజెంట్లు తమ లెక్కింపు కేంద్రాలు ఎక్కడున్నాయో పరిశీలించడానికి ఏయూ ఇంజినీరింగ్ కళాశాలకు వచ్చి వెళ్లారు…. అసెంబ్లీ బరిలో 176 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
ఒక్కొక్కరు 15 మంది ఏజెంట్లను నియమించుకోవడానికి అవకాశం ఉంది. ఈ లెక్కన 2,640 మంది ఏజెంట్లు లెక్కింపు కేంద్రాలకు తరలిరానున్నారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీల నేతలు ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పూర్తిస్థాయిలో ఏజెంట్లను నియమించుకోవడానికి ఆసక్తి చూపలేదు.
దీంతో వారి బదులు ప్రధాన పార్టీ అభ్యర్థులే స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లుగా తమవారిని నియమించుకున్నారు. వీరు స్వతంత్ర అభ్యర్థి తరపునే ఏజెంట్ పాస్ పొందినా లెక్కింపు కేంద్రంలో మాత్రం తమను నియమించిన పార్టీకి అనుకూలంగానే పనిచేయనున్నారు.
* మూడు పార్లమెంటు స్థానాల పరిధిలో 34 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరి తరఫున 510 మంది ఏజెంట్లు లెక్కింపు కేంద్రాలకు రానున్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో అన్ని సెగ్మెంట్లకు విశాఖలోనే లెక్కిస్తారు.
విశాఖ పార్లమెంటు పరిధిలో శృంగవరపుకోట సెగ్మెంట్ లెక్కింపు విజయనగరంలో జరుగుతుంది. దీంతో ఎంపీ తరపున అక్కడ కూడా ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలి.
అరకు పార్లమెంటు పరిధిలోని సెగ్మెంట్లయితే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో లెక్కింపు జరుగుతుంది. ఏజెంట్లను స్థానికంగా ఏర్పాటు చేసుకున్నా అభ్యర్థి మాత్రం నాలుగు చోట్ల పర్యవేక్షించడానికి వెళ్లాలంటే అవస్థలు పడాల్సిందే.
నేడే నగరానికి పయనం
ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ఏజెంట్లు ఉదయం 6 గంటలకే చేరుకోవాలని అధికారులు సూచించారు. నగర పరిధిలోని ఏజెంట్లు, అభ్యర్థులకు సమయానికి చేరుకున్నా గ్రామీణ జిల్లాలోని మిగతా నియోజకవర్గాల ఏజెంట్లు తెల్లవారేసరికి రావాలంటే వీలయ్యే పరిస్థితి లేదు.
అందుకే ముందు రోజే విశాఖ చేరుకునే విధంగా అభ్యర్థులు ప్రణాళిక చేసుకుంటున్నారు. ఏజెంట్లను లెక్కింపు కేంద్రాలకు తీసుకువచ్చే బాధ్యతను నియోజకవర్గ స్థాయి నేతలకు అప్పజెప్పుతున్నారు.
* నర్సీపట్నంలో మంత్రి అయ్యన్న పాత్రుడు మంగళవారం ఏజెంట్లతో సమావేశమై మరోసారి దిశా నిర్దేశం చేశారు. బుధవారం సాయంత్రం సిద్ధంగా ఉండాలని అందరూ కలిసి ఒకేసారి విశాఖ బయలుదేరాలని సూచించారు. వీరి బాధ్యతను మరో నాయకునికి అప్పజెప్పారు.
నియోజకవర్గం నుంచి విశాఖ వచ్చే మిగతా ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఎంత మంది ఉంటారో అంచనా వేసుకుని వారికి తగిన వసతి ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నారు.
* అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఇప్పటికే పోలింగు ఏజెంట్లతో సమావేశమై సూచనలు చేశారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు నూకాలమ్మ ఆలయాన్ని దర్శించుకుని కార్లలో విశాఖ బయలు దేరడానికి ప్రణాళిక చేసుకున్నారు.
వీరందరికీ బీచ్‌కు సమీపంలోని ఓ రిసార్టులో వసతి ఏర్పాట్లు చేస్తున్నారు.
* చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు సోమవారమే పార్టీ ఏజెంట్లతో సమావేశమై లెక్కింపు కేంద్రాలకు చేరుకునే ఏర్పాట్ల చర్చించారు.
* పాయకరావుపేట అధికార, ప్రతిపక్ష అభ్యర్థుల తరఫున కొంతమంది ఏజెంట్లపై బైండోవర్ కేసులు నమోదై ఉండడంతో వారి దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో మంగళవారం వారి స్థానంలో కొత్తవారిని ఏజెంట్లుగా నియమించే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు.
వీరందరినీ బుధవారమే విశాఖను తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
* అరకు, పాడేరు అభ్యర్థులు కూడా తమ పార్టీ ఏజెంట్లను బుధవారం నగరానికి తీసుకువచ్చి హోటళ్లలో వసతి కల్పించడానికి ఏర్పాట్లు చేశారు. బుధ, గురువారాల్లో ఏజెంట్లు, అభ్యర్థులు నగరంలోనే బస చేయనున్నారు.