News

Realestate News

2021 నాటికి ఆనందపురం-అనకాపల్లి రహదారి

 

2021 నాటికి ఆనందపురం-అనకాపల్లి రహదారి

శరవేగంగా నిర్మాణ పనులు

అనకాపల్లి – ఆనందపురం జాతీయ రహదారి నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.

నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న దిలీప్‌ బిల్డ్‌ కాన్‌ సంస్థ నవంబరు నెలాఖరు నుంచి పనులను ప్రారంభించింది. దీని మొత్తం పొడవు 50.78 కిలోమీటర్లు.

ఇది అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్‌ సమస్య చాలావరకు తగ్గుతుంది. దీనివల్ల రహదారి ప్రమాదాలు కూడా బాగా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.

ప్రధాన రహదారికి అనుంబంధంగా రెండువైపులా సర్వీసు రోడ్లను కూడా నిర్మిస్తున్నారు.

మొత్తం 10 పైవంతెనలు, 10 భూగర్భ మార్గాలు (వెహికిల్‌ అండర్‌పాస్‌లు), 11 తక్కువ ఎత్తు ఉండే భూగర్భమార్గాలు (లోలెవెల్‌ వెహికిల్‌ అండర్‌పాస్‌లు), మూడు వంతెనలు, మూడు ఇంటర్‌ఛేంజ్‌లు, వందకు పైగా కల్వర్టులు, ట్రక్కుల నిలుపే ప్రాంగణం నిర్మించనున్నారు.

ఇప్పటికే ఆనందపురం నుంచి అనకాపల్లి వెళ్లే మార్గంలో పలుచోట్ల చెట్లను, ముళ్లపొదలను తొలగించారు. రహదారి ఎత్తుకు తగ్గట్లుగా మట్టిని లెవెల్‌ చేస్తున్నారు.

వివిధ నిర్మాణాలకు అత్యంత కీలకమైన కాంక్రీటు కోసం రెడీమిక్స్‌ కాంక్రీట్‌(ఆర్‌.ఎం.సి.) ప్లాంటు కూడా ఏర్పాటుచేసుకున్నారు. ఇప్పటికే రోజుకు 650 మంది వరకు వివిధ కేటగిరీల కార్మికులు పనిచేయడం మొదలుపెట్టారు.

ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చిన తరువాత పనులు మరింత వేగంగా చేయడానికి వీలుగా కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు.

వర్షాల కారణంగా నిర్మాణ పనులు దెబ్బతినకుండా భారీగా నీరు ప్రవహించే ప్రాంతాలను అధ్యయనం చేసి అక్కడ కల్వర్టులు కట్టే పనులు కూడా ప్రారంభించారు.

జాతీయ రహదారికి అనుబంధంగా కాంక్రీటు కాల్వలను కూడా నిర్మిస్తారు. ఈ వ్యవస్థ పక్కాగా లేకపోతే వర్షాలకు రహదారులు దెబ్బతింటాయి. కాల్వలు కనపడకుండా వాటిపై కాంక్రీటు చట్టాలను అమరుస్తారు.

విభాగిని నుంచి అటూఇటూ 10.5 మీటర్ల పొడవుండేలా రహదారిని అత్యంత సువిశాలంగా నిర్మించనున్నారు. సర్వీసు రహదారి వెడల్పు 7.5 మీటర్లు ఉంటుంది.

2021నాటికి పూర్తి
జాతీయ రహదారి నిర్మాణం పనులను 2021నాటికల్లా పూర్తి చేయడానికి వీలుగా చర్యలు చేపట్టాం.

ఇప్పటికే గుత్తేదారు సంస్థ కొన్ని పనులను ప్రారంభించింది.

భూసేకరణకు సంబంధించిన చిన్నచిన్న అడ్డంకులు తొలగితే అత్యంత వేగంగా పనులు జరగడానికి అవకాశం ఉంటుంది.

రోజుకు కనీసం 1500 మందితో శరవేగంగా పనులు చేయడానికి ఆ సంస్థ సిద్ధంగా ఉంది.