News

Realestate News

2020కి భోగాపురం విమానాశ్రయం!

కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. విజయనగరం జిల్లాలో ప్రతిపాదించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి స్థల సేకరణను ప్రారంభించింది. మొత్తం 5,311 ఎకరాల్లో ఈ విమానాశ్రయాన్ని ప్రభుత్వ , ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిర్మించనున్నారు. మొదటి దశకు అవసరమైన 2,004 ఎకరాల స్థల సేకరణను ఒకటి, రెండు నెలల్లో పూర్తి చేయనున్నట్లు, ఇందుకు 1,700 కోట్లు వెచ్చించనున్నట్లు భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. జీఎంఆర్‌, షాపూర్‌జీ పల్లోంజీ, ఛాంగీ ఎయిర్‌పోర్ట్‌, దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ వంటి దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు ఈ విమానాశ్రయం నిర్మాణంలో పాలుపంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

వచ్చే నెలలో ‘రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌’ (ఆర్‌ఎఫ్‌పీ)కు ప్రభుత్వం దరఖాస్తులు కోరనుంది. కంపెనీలు బిడ్లు దాఖలు చేసి, ఎంపిక పూర్తయిన తర్వాత ఎంపికైన కంపెనీ/కన్సార్టియం ప్రాజెక్టుకు నిధుల సమీకరణ మార్గాల నివేదికను (ఫైనాన్షియల్‌ క్లోజర్‌) ఈ ఏడాది చివరి నాటికి లేదా 2017, జనవరిలో సమర్పించే వీలుంది. ప్రయాణికుల రద్దీ, సాంకేతిక అంశాల అధ్యయనం తర్వాత ప్రైవేటు, ప్రభుత్వాల పెట్టుబడులు, వాటా మొదలైన వాటిపై ఒప్పందాలు కుదుర్చుకుంటారు. 2019 లేదా 2020 నాటికి విమానాశ్రయం మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆసియా పసిఫిక్‌కు గేట్‌వేగా ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. విమానయాన రంగంతో ముడిపడిన తయారీ యూనిట్లను విమానాశ్రయం చుట్టూ అభివృద్ధి చేస్తారు. విమాన నిర్వహణ, మరమ్మతు (ఎంఆర్‌ఓ) యూనిట్‌ను, మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ కేంద్రం తదితరాలను ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. రెండు సమాంతర రన్‌వేలు, ఒక ద్వితీయ శ్రేణి రన్‌వే ఉంటాయి. నెల్లూరు సమీపంలోని దగదర్తి, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్‌ విమానాశ్రయాల ఇప్పటికే ఆర్‌ఎఫ్‌పీలను కోరారు. ప్రైవేటు భాగస్వామి ఎంపిక పూర్తయితే.. 2017 ప్రారంభం నాటికి ఈ విమానాశ్రయాల నిర్మాణాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2018 నాటికి ఇవి సిద్ధమయ్యే వీలుంది. కుప్పంలో ప్రతిపాదించిన విమానాశ్రయం ప్రాజెక్టు ప్రతిపాదన కొన్ని సాంకేతిక కారణాల వల్ల ముందుకు సాగడం లేదు. నాగార్జున సాగర్‌ సమీపంలో, దొనకొండలలో కూడా రెండు చిన్న విమానాశ్రయాల నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించింది. తిరుపతి (రేణుగుంట) విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించినప్పటికీ.. ఇంత వరకూ అక్కడ నుంచి ఒక్క అంతర్జాతీయ విమాన సర్వీసును కూడా ప్రారంభించలేదు. తగిన సదుపాయాలు అభివృద్ధి చేస్తే.. త్వరలోనే తిరుపతికి అంతర్జాతీయ సర్వీసు ప్రారంభమయ్యే వీలుందని ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.

 

Source By: http://www.eenadu.net/

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo