News

Realestate News

20 వేల కుటుంబాల్లో వెలుగు

25-06-16-01 VizagRealEstateNews

సమగ్ర సర్వేకు ప్రభుత్వ ఆదేశాలు
మూడు నెలల్లో కొలిక్కి: ఎమ్మెల్యే పల్లా
గాజువాక, న్యూస్‌టుడే: గాజువాక హౌస్‌కమిటీ భూముల క్రమబద్ధీకరణకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం ఆమోదముద్ర వేసింది. విజయవాడలో సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో గత నెల్లో మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులను ఆమోదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. 900 ఎకరాల భూముల్లో సమగ్ర సర్వే చేపడతారని, మూడునెలల్లో ఈ సమస్య కొలిక్కి తేవాలని సీఎం అధికారులను ఆదేశించారని చెప్పారు. ప్రత్యేక జీవో రావాల్సి ఉందని, ఏళ్లనాటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని ఎమ్మెల్యే వివరించారు.

వడివడిగా అడుగు…
పట్టణంలో 900ఎకరాల భూములపై ఈనాందారుడు, ప్రభుత్వం మధ్య ఇన్నాళ్లు వివాదం నలుగుతోంది. సమస్యను కొలిక్కితెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు భూ బాధితులకు న్యాయం చేయడానికి అడుగు ముందుకేసింది. సీసీఎల్‌ఏ నుంచి జీవో విడుదల కావడమే ఆలస్యం. ఈలోగా సర్వేచేసి 100, వెయ్యి చదరపు గజాలు, అంతకు మించి ఉన్న స్థలాల లబ్ధిదారులను గుర్తిస్తారు. లోగడ చేసిన సర్వేనే ప్రామాణికంగా తీసుకుంటారని, ఇంకా మార్పులు చేర్పులుంటే తుది సర్వేలో కొలిక్కి తెస్తారని ఎమ్మెల్యే పల్లా తెలిపారు.

పక్కా నిబంధనలు..
100 గజాల్లోపు స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరించాలని గతనెల 9న రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అంతకంటే ఎక్కువ స్థలంలో నిర్మించుకున్నవారు, ధారిద్య్రరేఖకు ఎగువనున్న వారికి ఎంతధర నిర్ణయించాలన్న దానిపై నిర్ణయం అధికారులకు వదిలేశారు.

* 2008లో ప్రభుత్వం జారీ చేసిన జీవోనెంబరు-296, 2015లో ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి 1.1.2014 నాటికి అనుభవదారులుగా ఉన్నవారికి భూములను క్రమబద్ధీకరిస్తారు.
* గాజువాక పరిధిలోకి వచ్చే భూములకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఏయే భూములు ఈ పరిధిలోకి వస్తాయన్న అంశాన్ని గతంలో వేసిన శాసనసభా కమిటీ చేసిన సిఫార్సుల్లో పేర్కొన్నారు. వాటినే పరిగణనలోకి తీసుకుంటారని ఎమ్మెల్యే వివరించారు. దాదాపు 20వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.