News

Realestate News

19 లక్షల ఇళ్ల నిర్మాణమే ధ్యేయం

19 లక్షల ఇళ్ల నిర్మాణమే ధ్యేయం
276  గ్రామాలకు పట్టణ గృహ నిర్మాణ పథకం అనుసంధానం
అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో 2019 నాటికి 19 లక్షలు గృహాలు నిర్మించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని రాష్ట్ర గృహనిర్మాణ శాఖామంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనకాపల్లి నుంచి సబ్బవరం వెళ్లే జాతీయరహదారిని ఆనుకొని ఉన్న రాజీవ్‌ గృహకల్ప సముదాయాన్ని మంగళవారం పరిశీలించారు. ముందుగా ఎమ్మెల్యే పీలాగోవింద సత్యనారాయణ, గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టరు ప్రసాద్‌ మంత్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి 31 బ్లాకుల్లో నిర్మించిన 744 గృహాలను పరిశీలించారు. గత ప్రభుత్వం అధ్వానంగా నాసిరకంగా నిర్మాణాలు చేపట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గృహాల స్థితిగతులను ఎమ్మెల్యే పీలాగోవింద సత్యనారాయణ మంత్రికి వివరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ స్ఫూర్తితో హౌసింగ్‌ స్కీంను చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టారన్నారు. శంకరం గృహకల్ప సముదాయానికి రూ.20 కోట్లు వెచ్చించారన్నారు. రూ.12 కోట్లు ప్రాజెక్టు ఎస్టిమేషన్‌, రూ.9 కోట్లు మౌలిక వసతుల కల్పనకు చేపడుతున్నామని తెలిపారు. 10 ఎకరాల్లో నిర్మించిన 744 గృహాలు 14 ఏళ్లుగా వృథాగా వదిలేశారన్నారు. గతంలో శంకరంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లబ్ధిదారులకు గృహాలు మంజూరు చేయాలనే లక్ష్యంతో రూ.9 కోట్లు మౌలిక వసతులకు నిధులు మంజూరు చేశారన్నారు. గత ప్రభుత్వం ఉదాసీనత వల్లే ఈ గృహసముదాయం కళావిహీనంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేకంగా పరిగణించి మాఫీ చేయాల్సిన రూ.3.66 కోట్లు రుణంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చేపట్టబోయే 19 లక్షల గృహాల నిర్మాణానికి రూ.50 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, భీమిలి తదితర నియోజకవర్గాల్లో ఉన్న 276 గ్రామాలకు పట్టణ గృహనిర్మాణ పథకం వర్తింపజేస్తున్నామని ప్రకటించారు. పథకంలో భాగంగా గృహం నిర్మాణానికి రూ.2.50 లక్షలు రాయితీ రుణం అందిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ నీటి సదుపాయం లేకపోవడం వల్లే నేడు గృహాలు ఎందుకూ పనికి రాకుండా పోయాయన్నారు. మౌలిక వసతుల కల్పనకు, తాగునీటి కోసం రూ.9 కోట్లు ముఖ్యమంత్రి మంజూరు చేయడం వల్ల నేడు గృహసముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతున్నాయన్నారు. రూ.25 లక్షలతో కల్యాణ మండపం కూడా నిర్మిస్తామన్నారు. నియోజకవర్గంలో వెయ్యి హుద్‌హుద్‌ గృహాలు నిర్మిస్తున్నామన్నామని, మౌలిక వసతుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. గృహనిర్మాణంలో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొని రావడం వల్ల నేడు అక్రమాలకు తావులేకుండా పోయిందన్నారు. శంకరం గృహకల్ప సముదాయంలో లబ్ధిదారులు బ్యాంకు రుణాలు అన్నీ తప్పనిసరిగా మాఫీ చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం గృహ నిర్మాణ పథకానికి సంబంధించి బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టరు ప్రసాద్‌, డీఈ జి.వి రమేష్‌, ఏఈ రామకృష్ణ, గ్రామీణ నీటిపారుదల శాఖ డీఈ దుర్గాప్రసాద్‌, ఏఈ విజయలక్ష్మి, గృహనిర్మాణ శాఖ డీఈ ధనుంజయరావు, ఏఈ రామచంద్రరావు, అనకాపల్లి, కశింకోట తహసీల్దార్‌ సత్యనారాయణ, జ్ఞానవేణి, సీఐ మురళీరావు, డీఎస్పీ వెంకటరమణ, తెదేపా నాయకులు మళ్ల సురేంద్ర, బొలిశెట్టి శ్రీనివాసరావు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo