మధురవాడలో గజం రూ. 32,300

ఖాళీ స్థలాల వేలానికి స్పందన
ఒక రోజు వుడా ఆదాయం రూ. 21.70 కోట్లు
విశాఖపట్నం, ఈనాడు: వివిధ లేఅవుట్లలో ఖాళీ స్థలాల (ఆడ్బిట్ల) విక్రయాల్లో విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) గురువారం ఒకే రోజు రూ. 21.70 ఆదాయాన్ని ఆర్జించింది. తొలుత 43 ప్లాట్ల కోసం వేలం నిర్వహిస్తామని ప్రకటించారు. రెండు ప్లాట్లపై న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వడంతో చివరి క్షణంలో వేలం నుంచి తొలగించారు. 31 స్థలాలను దరఖాస్తుదారులు వేర్వేరు ధరలకు దక్కించుకున్నారు. మధురవాడలో హరిత హౌసింగ్ ప్రాజెక్టు సమీపంలో స్థలానికి (ప్లాట్ నం: 58) అత్యధికంగా 49 మంది దరఖాస్తు చేశారు. దీని ధర చదరపు గజం రూ. 32,300 ధరకు వెళ్లింది. ఈ స్థలాన్ని మోహన్ అనిమిరెడ్డి దక్కించుకున్నారు. ఇక్కడ వుడా నిర్ణయించిన ధర చదరపు గజానికి రూ. 25 వేలు. పోతినమల్లయ్యపాలెంలో మరో ప్లాట్ చదరపు గజం రూ. 26 వేల ధరకు వెళ్లింది. శొంఠ్యాంలో ఇంకో ప్లాటు చ.గ. రూ. 15 వేల ధరకు దరఖాస్తుదారులు దక్కించుకున్నారు. శివారు ప్రాంతాల్లో ఖాళీ స్థలాలకు దరఖాస్తుదారులు తీవ్రంగా పోటీ పడ్డారు.