లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

కొత్తూరు(అనకాపల్లి), న్యూస్‌టుడే: అనకాపల్లికి చెందిన వుడ్ కార్వింగ్ కళాకారుడు వల్లివిరెడ్డి శ్రీనివాసరావుకు జాతీయ స్థాయి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. చెక్కపై వేలాది చిత్రాలను శ్రీనివాసరావు రూపొందించారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్, మథర్ థెరిస్సా, నెహ్రూ, గాంధీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా సినీ, రాజకీయ ప్రముఖుల చిత్రాలను టేకు, గుమ్మడి, కంబ చెక్కలపై చిత్రీకరించి గుర్తింపు పొందారు. నరేంద్ర మోదీ తల్లితో ముచ్చటిస్తున్నట్లు, భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రధాని మోదీతో కరచాలనం, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్వచ్ఛభారత్ చిత్రాలు గుర్తింపు పొందాయి. వీటిని తయారు చేయడమే కాకుండా వారికి అందజేయడానికి విశేష కృషి చేశారు. ఇప్పటికే ఆయనకు సంఘమిత్ర, సుజనపుత్ర, మార్వలెస్ హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్ లభించాయి. ఇప్పుడు దేశంలో గుర్తింపు పొందిన లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం దక్కించుకున్నారు. ఈ మేరకు లిమ్కాబుక్ ఎడిటర్ విజయ్ ఘోష్ నుంచి ఆయనకు ఉత్తర్వులు, ధ్రువపత్రం అందాయి. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.