News

Realestate News

vsp-gen1a

‘అంకుర’ నిర్మాణంపై తొలగిన అనిశ్చితి
వుడాకే నిర్మాణ బాధ్యత
‘ఈనాడు’ కథనంతో కదలిక
విశాఖపట్నం, ఈనాడు: నగరం నడిబొడ్డున సిరిపురం కూడలిలో అంకుర కేంద్ర (ఇంక్యుబేషన్‌ సెంటర్‌) నిర్మాణంపై అనిశ్చితి తొలగింది. దీని నిర్మాణ బాధ్యతను విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)కు అప్పగించేందుకు సాఫ్టువేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) ముందుకొచ్చింది. ఈ విషయాన్ని వుడా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ వి.బాబూరావునాయుడు ధ్రువీకరించారు. వుడాతో కలిసి రూ. 62.70 కోట్ల అంచనా వ్యయంతో ఈ కేంద్ర నిర్మాణం కోసం ఎస్‌టీపీఐ వర్గాలు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. దీని నిర్మాణాన్ని కేంద్ర ప్రజా పనుల విభాగానికి అప్పగించాలన్న ఎస్‌టీపీఐ నిర్ణయంపై వుడా అభ్యంతరం చెప్పడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయాన్ని ఈ నెల 10న ‘అంకుర’నిర్మాణం ఎలా?’ శీర్షికతో ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. నిర్మాణ రంగంలో వుడాకు ఉన్న అనుభవం, ప్రత్యేకంగా ఇంజినీరింగ్‌ వ్యవస్థ ఉన్న విషయాన్ని ఎస్‌టీపీఐ వర్గాలకు వివరిస్తూ అధికారులు లేఖ రాశారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత వుడాకు అప్పగించాలని సూచించారు. ‘ఈనాడు’లో వచ్చిన కథన నేపథ్యంలో రెండు రోజుల క్రితం దిల్లీ వెళ్లిన వుడా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ బాబూరావునాయుడు ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ జనరల్‌తో సమావేశమయ్యారు. చర్చల తరువాత అంకుర కేంద్ర నిర్మాణాన్ని వుడాకు అప్పగించేందుకు ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ జనరల్‌ అంగీకరించారని ఉపాధ్యక్షుడు బాబూరావునాయుడు తెలిపారు. నెలాఖరులోగా దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయన్నారు.

హైకోర్టులో వుడా కౌంటర్‌
బీచ్‌రోడ్డులో ఎన్‌ఎండీసీకి కేటాయించిన స్థలాన్ని రద్దు చేసిన కేసులో వుడా తరఫున హైకోర్టులో సోమవారం కౌంటర్‌ దాఖలు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. స్థలాన్ని రద్దు చేస్తూ వుడా తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు డిస్మిస్‌ చేసి తదుపరి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ నోటీసులందుకున్న వుడా అధికారులు కౌంటర్‌ దాఖలు చేస్తున్నారు. స్థలాన్ని ఏ పరిస్థితుల్లో రద్దు చేయాల్సి వచ్చిందో వివరించడంతోపాటు వుడాకు ఉన్న అధికారాలను కూడా ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది.