News

Realestate News

15వేల మందికి ‘క్రమబద్ధీకరణ’ పట్టాలు

15వేల మందికి ‘క్రమబద్ధీకరణ’ పట్టాలు
30న సీఎం చేతుల మీదుగా అందించేందుకు ఏర్పాట్లు
విశాఖపట్నం, న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబునాయుడు విశాఖ పర్యటన ఖరారైంది. ఈనెల 30న ఆయన నగరానికి వస్తున్నందున అదేరోజున 15వేల మందికి క్రమబద్ధీకరణ పట్టాలు జారీ చేయాలని రెవెన్యూ యంత్రాంగం భావిస్తోంది. ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగరంలో 100 గజాల లోపు స్థలాల క్రమద్ధీకరణకు గత ఏడాది ఆగస్టులో దరఖాస్తులు స్వీకరించారు. వాటికి పట్టాలను కూడా సిద్ధం చేశారు. సీఎం చేతుల మీదుగా ఈ పట్టాలను అందించాలని గత కొంతకాలంగా అధికారులు భావిస్తున్నారు. సమయం కుదరకపోవడంతో ఈ కార్యక్రమం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఈ తరుణంలో ఈనెల 30న సీఎం విశాఖకు వస్తున్నారు. అదే రోజున ఈ పట్టాల పంపిణీ, బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు. గాజువాక బస్‌స్టేషన్‌ సమీపంలో ఉన్న జూనియర్‌ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది. క్రమబద్ధీకరణ కోసం 63,815 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 25,396 దరఖాస్తుల సర్వే పూర్తి అయింది. సర్వే పూర్తి చేసిన వాటిలో తహసిల్దార్లు 13,745 దరఖాస్తులను ఆమోదించారు. ఇంకా 8,479 దరఖాస్తులను ఆమోదించాల్సి ఉంది. 3,172 దరఖాస్తులను తిరస్కరించారు. ఆర్డీవో స్థాయిలో 13,125 దరఖాస్తులను ఆమోదించి క్రమబద్ధీకరణకు తుది ఆమోదం తెలిపారు. ఇంకా 38,419 దరఖాస్తులు సర్వే చేయాల్సి ఉంది. క్రమబద్ధీకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చిన మేరకు 30న పట్టాలను అందజేయాలని భావిస్తున్నారు.

సీఎం పర్యటన సాగేదిలా…
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 30న ఉదయం 9గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖకు వస్తారు. విమానాశ్రయం నుంచి నేరుగా హెలికాఫ్టర్‌లో బయలుదేరి విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. విజయనగరం జిల్లా పర్యటన ముగించుకొని మధ్యాహ్నం 3 గంటలకు హెలికాఫ్టర్‌లో బీచ్‌రోడ్డులోని కోస్టల్‌ బ్యాటరీ హెలిప్యాడ్‌ వద్దకు సీఎం చేరుకుంటారు. రోడ్డు మార్గంలో పోలీసుబ్యారెక్స్‌కు వెళతారు. అక్కడ ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ వ్యవస్థను ప్రారంభిస్తారు. తర్వాత గాజువాక వెళ్లి బహిరంగ సభలో పాల్గొంటారు. ఇది ముగిసిన తర్వాత ఆరిలోవలో అపోలో ఆసుపత్రుల సముదాయాన్ని ప్రారంభిస్తారు. దీని తర్వాత నేరుగా తొట్లకొండ వెళ్తారు. అక్కడ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. తదుపరి బీచ్‌రోడ్డులో కార్తీకవనం వద్ద బేహోటలును ప్రారంభిస్తారు. ఆపై పారిశ్రామిక వేత్త కుమారుని వివాహ రిసెప్షన్‌కు సీఎం హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత రాత్రి 10 గంటల ప్రాంతంలో సీఎం ప్రత్యేక విమానంలో తిరుగుప్రయాణమవుతారు. అయితే ఈ కార్యక్రమాలన్నీ అధికారికంగా ఖరారు కావాల్సిఉంది.

Source : http://www.eenadu.net/