News

Realestate News

1/4 నాలుగు బీచ్‌లకు ఒకటే పూర్తి

Beaches are four full

రెండింటికి కేంద్ర సంస్థల కొర్రీలు
మరోదానికి న్యాయపరమైన అడ్డంకులు
నిధులుండీ మొదలవ్వని పనులు

విశాఖ నగరం… భీమునిపట్నం మధ్య ప్రభుత్వం ప్రతిపాదించిన బీచ్‌లు…. 4ఇప్పటికి పూర్తయింది కేవలం ఒకటే.. రెండింటికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయగా… మరొకదానిపై న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. విశాఖ తీరాన్ని పర్యాటకంగా అగ్రస్థానంలోకి తీసుకెళ్లాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు వివిధ రూపాల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. పర్యాటకులు పెరిగితే… దానికి అనుబంధంగా అనేక వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి.. వేలాదిమందికి ఉపాధి దొరుకుతుంది. పనుల ప్రారంభానికి అన్నిటినీ సిద్ధం చేసుకున్నాక అడ్డంకులు ఎదురవటంతో పర్యాటకరంగానికి కుంటి నడక తప్పటం లేదు.

విశాఖ నగరంలో పెరుగుతున్న సందర్శకుల కోసం తీరంలో మరిన్ని ఆకర్షణీయ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఏనాడో నిర్ణయించింది. ఇప్పటికే వినియోగంలో ఉన్న బీచ్‌ల్లో అనేక సదుపాయాలనుకల్పించడం, కొత్త బీచ్‌లను ఏర్పాటు చేయడం కోసం జిల్లా యంత్రాంగం నుంచి ఏడాదిన్నర క్రితం వెళ్లిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆగమేఘాల మీద ఆమోదించి, నిధులను కేటాయించింది. పాత బీచ్‌లో పనులు సజావుగానే జరుగుతున్నాయి. కొత్తబీచ్‌లపై సమస్యలు ఎదురవుతున్నాయి.

1. సాగర్‌నగర్‌ బీచ్‌
సాగర్‌నగర్‌లో సినోరా బీచ్‌ రిసార్ట్స్‌కు ఎదురుగా 2.42 ఎకరాల్లో రూ. 65 లక్షల అంచనా వ్యయంతో కొత్త బీచ్‌ అభివృద్ధికి ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం అనుమతులిచ్చింది.
కోస్తా తీర ప్రాంత నియంత్రణ (సీఆర్‌జడ్‌) చట్టానికి లోబడి పనుల కోసం యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది.
కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అనుమతి కోసం అధికారులు చెన్నైలోని ప్రాంతీయ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపారు.
బీచ్‌ ఏర్పాటుకు స్థానిక పంచాయతీ తీర్మానం అవసరమని అక్కడి నుంచి కొర్రీ రావటంతో పనులు నేటికీ ప్రారంభం కాలేదు.

2. ఎండాడ వద్ద…
ఎండాడ వద్ద సాగర్‌నగర్‌ దాటాక అంధ విద్యార్థుల పాఠశాలకు ఎదురుగా 2.44 ఎకరాల విస్తీర్ణంలో రూ. 80 లక్షల అంచనా వ్యయంతో మరో బీచ్‌ అభివృద్ధికి ఏడాది క్రితం ప్రభుత్వ ఆమోదం లభించింది. బీ జిల్లా స్థాయిలో సీఆర్‌జడ్‌ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న కలెక్టర్‌ షరతులకు లోబడి అనుమతులిచ్చారు.

కేంద్ర అటవీ, పర్యావరణ అభివృద్ధిశాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్థానిక సంస్థల నుంచి అనుమతులు తీసుకోనందున పనులు చేపట్టవద్దని ఆదేశించాయి.
టెండర్లను పిలిచినా ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు.

3. మంగమారిపేట వద్ద…
కొత్తూరు దగ్గరలో కొత్త బీచ్‌ ఏర్పాటుకు 2.11 ఎకరాలను అధికారులు గుర్తించారు.
రూ. 1.50 కోట్లతో అనేక సౌకర్యాల కల్పన కోసం యంత్రాంగం ఏడాదిన్నర క్రితం ప్రభుత్వ అనుమతి తీసుకుంది. బీ సీఆర్‌జడ్‌పరంగా జిల్లా స్థాయిలో అనుమతులు వచ్చాయి.
ప్రయివేట్‌ వ్యక్తి ఒకరు 2.11 ఎకరాల స్థలం తనదంటూ న్యాయస్థానం నుంచి స్టే తేవడంతో పనులు ప్రారంభించే వీల్లేకపోయింది.
ఆర్కే బీచ్‌ తరువాత ఇది రెండో అతి పెద్ద బీచ్‌ అవుతుందని అధికార వర్గాలు భావించాయి.

4. తొట్లకొండ వద్ద..
తొట్లకొండ వద్ద రూ. 2 కోట్లతో అభివృద్ధి చేసిన కొత్త బీచ్‌ ప్రారంభానికి సిద్ధమైంది.
దీని విస్తీర్ణం 2.25 ఎకరాలు.
భీమునిపట్నం వెళ్లే మార్గంలో ఎంతో సుందరంగా దీన్ని జిల్లా యంత్రాంగం తీర్చిదిద్దింది.
తొట్లకొండ ప్రవేశ మార్గానికి ఎదురుగా అందంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో దీన్ని సిద్ధం చేశారు.
ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించాలన్నది అధికారుల ఆలోచన. అందుకే ఆలస్యమవుతోంది. బీ విశాఖ – భీమునిపట్నం మధ్య గడిచిన 30 ఏళ్లలో కొత్తగా ఏర్పాటై ప్రారంభమవుతున్న బీచ్‌ ఇదే అవుతుంది.

అభ్యంతరాలపై సమాధానం…
సాగర్‌నగర్‌, ఎండాడ కొత్త బీచ్‌ల ఏర్పాటుపై కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అభ్యంతరాలపై శాఖాపరంగా సమాధానాలిచ్చాం. స్వయంగా చెన్నై వెళ్లి సంబంధిత ప్రాంతీయ కార్యాలయ అధికారులతో మాట్లాడాను. జీవీఎంసీ పరిధిలో పంచాయతీల అనుమతి అవసరం ఉండదని చెప్పి, జీవీఎంసీ పరంగా అనుమతులున్న విషయాన్ని వివరించి లిఖిత పూర్వకంగా కూడా సమాధానమిచ్చాం. దీనిపై వారు సానుకూలంగా స్పందించారు. త్వరలో అనుమతి వస్తుందన్న ఆశతో ఉన్నాం. మంగమారిపేటలో కొత్త బీచ్‌ కోసం రెవెన్యూశాఖ కేటాయించిన భూమిపై ప్రయివేట్‌ వ్యక్తి తీసుకొచ్చిన స్టే ఎత్తివేత కోసం శాఖాపరంగా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాం. అనుమతులు వచ్చిన వెంటనే కొత్త బీచ్‌ల పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం.

– ఆర్‌.శ్రీరాములనాయుడు, కార్యనిర్వాహక సంచాలకుడు, రాష్ట్ర పర్యాటకశాఖ

ఇవీ ప్రభుత్వ లక్ష్యాలు..
2020 నాటికి సందర్శకుల సంఖ్యను కోటికి చేర్చాలి. ప్రస్తుతం ఏడాదికి సుమారుగా 60 లక్షలమంది వస్తున్నారు. ఇందులో సుమారుగా 53 లక్షలమంది దేశీయ పర్యాటకులు, 7 లక్షల మంది విదేశీయులు ఉన్నారు. గడచిన రెండేళ్లలో సందర్శకుల సంఖ్య సుమారుగా 15 లక్షలు పెరిగింది.

పర్యాటకుల సంఖ్య పెరిగితే ప్రభుత్వానికి ఆదాయ వృద్ధితోపాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి దొరుకుతుంది. సందర్శకులను ఆకట్టుకునే కొత్త ప్రదేశాల అభివృద్ధి. ప్రకృతి సిద్ధ అందాలను వెలుగులోకి తీసుకురావాలి. అన్నిచోట్లా మౌలిక సదుపాయాల కల్పన. 2020 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలి.