ఒక్కో పోస్టుకు 50 మందిపైనే!
ఒక్కో పోస్టుకు 50 మందిపైనే!
పౌర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సాధన చేస్తున్న నిరుద్యోగ యువత
గ్రామ, వార్డు సచివాలయ కొలువులకు సంబంధించిన పరీక్షల క్రతువు ఊపందుకుంది. వేల సంఖ్యలోని ఉద్యోగాల కోసం లక్షల మంది నిరుద్యోగులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
ఎలాగైనా ఈ సర్కారీ కొలువులను సాధించాలనే పట్టుదలతో పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. శిక్షణా కేంద్రాలు, గ్రంథాలయాలు ఈ అభ్యర్థులతోనే నిండిపోతున్నాయి.
నమూనా పరీక్షలతో తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటున్నారు. వివిధ శాఖల పరిధిలో పోస్టులకు పోటీ తీవ్రంగా ఉంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, మహిళల కోటా అమలు చేయనుండటంతో తీవ్రంగా శ్రమిస్తే తప్ప కొలువు సాధించడం కష్టమే.
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: జిల్లాలోని 739 గ్రామ, 604 వార్డు సచివాలయాల్లో 10,872 పోస్టులు భర్తీ చేయనుండగా వీటి కోసం 2.13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి కోసం 406 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు.
తొలి రోజే అయిదు విభాగాలకు చెందిన 3,585 పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. వీటికే అత్యధికంగా 1.59 లక్షల మంది అభ్యర్థులు హాజరవ్వనున్నారు. సగటున ఒక్కో పోస్టుకు 50 మంది పోటీ పడుతుండడం విశేషం.
ఒక్కో పోస్టుకు పోటీ ఎలా ఉందంటే..
సెప్టెంబర్ 1న కేటగిరి-1 విభాగంలో నాలుగు శాఖలకు చెందిన 2,846 పోస్టులకు సంబంధించి ఉదయం పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో మహిళా పోలీసు పోస్టులే 1,281 ఉన్నాయి.
గ్రేడ్-5 పంచాయతీ సెక్రటరీ, సంక్షేమం, ఎడ్యుకేషన్ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులు కలిపి 1,565 ఉన్నాయి. వీటన్నింటి కోసం 1.32 లక్షల మంది పోటీపడుతున్నారు.
సాధారణంగా మహిళా పోలీసు పోస్టులే ఎక్కువగా ఉండడంతో మొదటి రోజు పరీక్షలకు మహిళా అభ్యర్థులే అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సగటున ఒక్కో పోస్టుకు 54 మంది పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
* సెప్టెంబర్ 1న మధ్యాహ్నం నిర్వహించబోయే కేటగిరి-3లో 739 డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల పరీక్ష కోసం 27,779 మంది హాజరవనున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 37 మంది పోటీ పడుతున్నారు.
* 1240 వీఆర్వో, సర్వే అసిస్టెంట్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనుండగా వీటి కోసం 17,401 మంది పోటీపడుతున్నారు. సగటున ఒక్కో పోస్టుకు 14 మంది పోటీ ఎదుర్కొంటున్నారు. …