1 నుంచి పెట్రోలియం యూనివర్సిటీ తరగతులు ప్రారంభం

సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న తరగతి గదులు
ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: విశాఖకు 2016-17 విద్యాసంవత్సరంలో మంజూరైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇంజినీరింగ్ (ఐఐపీఈ) విశ్వవిద్యాలయం తరగతుల నిర్వహణకు సిద్ధమైంది. ఇందు కోసం సర్వాంగ సుందరంగా ఆధునిక వసతులతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తరగతి గదులను నిర్మించారు. ఈ విశ్వవిద్యాలయంలో ఆగస్టు ఒకటి నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. కెమికల్ ఇంజినీరింగ్, పెట్రోలియం ఇంజినీరింగ్‌లలో బ్యాచులర్ డిగ్రీని ఈ ఏడాది విద్యార్థులు అభ్యసించనున్నారు. ఒక్కో కోర్సులో 50 సీట్లు చొప్పున కేటాయించారు. ఇప్పటికే వీటికి సంబంధించిన ఆన్లైన్ కౌన్సెలింగ్ ముగిసింది. అన్ని సీట్లు భర్తీ అయ్యాయని ఐఐపీఈ అకడమిక్ సలహాదారు ఆచార్య వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ తెలిపారు. ఈనెల 29, 30 తేదీల్లో విద్యార్థుల ప్రవేశాలు నేరుగా చేపట్టనున్నారు. 31న విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. వచ్చే ఏడాది నుంచి పీజీ విభాగాన్ని ప్రారంభిస్తారు.
అయిదు తరగతి గదులు
ఐఐపీఈ విశ్వవిద్యాలయాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల విభాగంలో ప్రారంభించనున్నారు. ఇందు కోసం కొన్ని గదులను ఇంజినీరింగ్ కళాశాల కేటాయించింది. ఇందులో అయిదు తరగతి గదులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దారు. ఇందులో రెండు సాధారణ తరగతి గదులు, రెండు ఈ తరగతి గదులు, ఒకటి మీడియా కాన్ఫరెన్స్ గది. ఈ క్లాస్రూమ్, మీడియా కాన్ఫరెన్స్ గదుల్లో భారీ ఎల్సీడీలు, వీడియో కాన్ఫరెన్స్‌ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడి విద్యార్థులు ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి నేరుగా తరగతులు వినే అవకాశం కూడా కల్పించనున్నారు. దాదాపు వీటి నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఇక తరగతులు జరగడమే తరువాయి. విద్యార్థులకు వసతి సదుపాయం ఏర్పాటు చేశారు. హనుమంతువాక సమీపంలో హాస్టల్ ఏర్పాటు చేసినట్లు ఆచార్య వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ తెలిపారు. ఏసీ సౌలభ్యం కూడా కల్పించారు. ఈ విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం 200 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఇక్కడ భవన నిర్మాణాలు పూర్తయ్యే వరకు ఏయూ ఇంజినీరింగ్ విభాగంలోనే ఐఐపీని నిర్వహిస్తారు.
ఖరగ్‌పూర్ నుంచి ప్రత్యేక బృందం
నూతనంగా ఏర్పడిన విశ్వవిద్యాలయం కావడంతో ఐఐపీఈకి ఖరగ్‌పూర్ ఐఐటీ సాంకేతిక, ఇతర విద్యాసంబంధ సహాయం అందించనుంది. ఇందులో భాగంగా రెండు విశ్వవిద్యాలయాల మధ్య గతంలోనే ఒప్పందం జరిగింది. 29 నుంచి విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు జరగనున్నందున ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి ప్రత్యేక బృందం రానుందని ఆచార్య ప్రసాద్ తెలిపారు. ఈ బృందం విద్యార్థుల ప్రవేశాలను పర్యవేక్షిస్తుందన్నారు. 29, 30 తేదీల్లో ప్రవేశాలు పూర్తయ్యాక సీట్లు మిగిలితే తిరిగి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. తరగతులు ప్రారంభమైన మూడు వారాల పాటు ఐఐటీ ఖరగ్ పూర్ ఆచార్యులే బోధన సాగిస్తారన్నారు. ప్రత్యేకంగా ఇప్పటి వరకు తాము నలుగురు ఆచార్యలను ఐఐపీఈ కోసం నియమించామన్నారు. వీరితో పాటు మరి కొన్ని నియామకాలు జరుగుతాయని ఆచార్య ప్రసాద్ తెలిపారు.