News

Realestate News

హమ్మయ్య దాటేసింది!

Vizag Real Estate News

ఒడిశావైపు వెళ్లిన రోను తుపాను
వూపిరి పీల్చుకున్న యంత్రాంగం
ఈనాడు – విశాఖపట్నం

గండం గడిచింది. రోను తుపాను తీవ్ర ప్రభావం చూపించకుండానే విశాఖ తీరం వెంబడి ఒడిశావైపు వెళ్లిపోయింది. శుక్రవారం ఇది తీవ్ర తుపానుగా మారి బీభత్సం సృష్టిస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. సాధారణ వర్షం మినహా పెద్దగా ఇబ్బందులేమీ ఎదురుకాకపోవటంతో అంతా వూపిరి పీల్చుకున్నారు. రోను తుపాను కారణంగా రెండురోజులపాటు నగరమంతటా భారీవర్షం కురిసింది. తుపాను గాలులు గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అధికారులు ప్రకటించగానే, తీవ్రత ఎక్కువగా ఉంటుందని యంత్రాంగం అంచనాకు వచ్చింది. విశాఖ తీరంలోకి ప్రవేశించాక రోను తీవ్ర తుపానుగా మారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో తీర ప్రాంతాల్లో కల్లోలం మొదలైంది. తుపాను మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్య ఉన్నపుడే విశాఖ తీరం వెంబడి గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురిశాయి. సమీపిస్తున్న కొద్దీ వీటి తీవ్రత పెరుగుతుందని అంచనా వేసినా, అదృష్టం కొద్దీ గంటకు 10 కిలోమీటర్ల నుంచి 16 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదిలి శుక్రవారం ఉదయం 9 నుంచి 11 గంటల మధ్యే విశాఖ తీరం మీదుగా తుపాను ఒడిశావైపు వెళ్లింది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము మధ్య నగర, గ్రామీణ జిల్లాలోగల తీర ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. నగరాన్ని దాటి కళింగపట్నం తీరంలో ప్రవేశించే కొద్దీ వర్ష తీవ్రత తగ్గింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తరువాత నగరంలో మళ్లీ సాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. గడిచిన రెండు రోజుల వ్యవధిలో నగర పరిధిలో సగటున 57 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అత్యధికంగా పారిశ్రామిక ప్రాంతంలో వర్షం కురవడం విశేషం.

సముద్రంలోనే ఎక్కువగా…
రోను తుపాను తీరం వెంబడి ముందుకు కదలడంతో ఎక్కువ వర్షం సముద్రంలోనే కురిసిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. భూమి మీద కురిసినదానికంటే రెండింతలు అదనంగా సముద్రంలో వర్షం పడిందని అంచనా. పశ్చిమ గాలుల ప్రభావంతో రోను తుపాను శ్రీలంక మొదలుకొని కళింగపట్నం వరకు తీరాన్ని ఆనుకొని క్రమంగా ముందుకు వెళ్లింది. పశ్చిమ గాలులు బలహీనంగా ఉంటే, ఈపాటికే ఏదో ఒక చోట భూమిపైకి వచ్చి బలహీనపడేదని నిపుణులు తెలిపారు. ఎక్కువ వర్షం సముద్రంలో కురవడం నిరాశ పరిచినా, ప్రశాంతంగా తీరాన్ని దాటడం కలిసొచ్చే అంశం.

వూపిరి పీల్చుకున్న జనం
జిల్లాలో గురువారంతో పోలిస్తే శుక్రవారం తక్కువ వర్షపాతం నమోదయ్యింది. చోడవరం మండలం సింహాద్రిపురంలో పదుల సంఖ్యలో పెంకుటిళ్లు పైకప్పులు దెబ్బతిన్నాయి. గౌరవరం వద్ద శారదా నది కాజ్‌వే అప్రోచ్‌ రహదారి దెబ్బతింది. నర్సీపట్నం మండలంలోని ఎరకన్నపాలెంలో ఇళ్లు, భీమిలిలో మట్టిగోడ కూలడం మినహా ఎలాంటి సంఘటనలూ జిల్లాలో చోటుచేసుకోలేదు.

Source : http://www.eenadu.net/