News

Realestate News

స్థిరాస్తి ఇక చకచకా

vizag real estate news

స్థిరాస్తి ఇక చకచకా
నిబంధనలు నోటిఫై చేసిన ప్రభుత్వం
సంస్థల నమోదు రుసుం తగ్గింపు
ఈనాడు – దిల్లీ: కొనుగోలుదార్లకు మేలు చేసేలా, స్థిరాస్తి రంగంలో పారదర్శకత పెంపొందేలా రూపొందించిన ‘స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి నిబంధనలు 2016’ను ప్రభుత్వం సోమవారం నోటిఫై చేసింది. 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇవి అమల్లోకి వచ్చేశాయి. రాష్ట్రాలు ఇందుకనుగుణంగా నిబంధనలు జారీ చేయాల్సి ఉంది. 3 నెలల క్రితం వెల్లడించిన ముసాయిదాతో పోలిస్తే తాజా ఆదేశాల్లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం..

* అమలవుతున్న ప్రాజెక్టు కోసం సమీకరించి, వినియోగించని నిధుల్లో 70 శాతాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతాలో ప్రమోటర్లు ఉంచాలి. ఇందువల్ల ప్రాజెక్టును సజావుగా పూర్తిచేసేందుకు వీలవుతుంది. ముందుగా నిర్దేశించుకున్న సమయంలో కనుక ప్రాజెక్టు పూర్తయిందనే ధ్రువీకరణ పత్రాన్ని పొందలేకపోతే, ప్రమోటర్లు కొన్ని నిబంధనలు పాటించాలి. ముందస్తుగా ఆమోదం పొందిన ప్రణాళిక, తరవాత చేసిన మార్పులతో పాటు ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో కూడా వెల్లడించాలి. కొనుగోలుదార్ల వద్ద నుంచి సేకరించిన నిధులు, ఎంత వినియోగించారు వంటి వివరాలను ఇంజినీరు/ఆర్కిటెక్టు/చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ధ్రువీకరణతో వెల్లడించాలి. ప్రతి త్రైమాసికం ముగిసిన 15 రోజుల్లోగా సంస్థ వెబ్‌సైట్‌లో ఈ సమాచారాన్ని పొందుపరచాలి.
* అపార్టుమెంటు, స్థలాల్లో ఎన్ని బుక్‌ అయ్యాయి, నిర్మాణం ఏ స్థాయిలో ఉంది, ఏయే ఆమోదాలు లభించాయి, ఏయే మార్పులు చేస్తున్నారు వంటివీ తెలపాలి.
* ఆదాయపు పన్ను రిటర్నులు వెల్లడించాలని గతంలో నిర్ణయించగా, ఆ నిబంధనను పరిహరించారు.
* రాష్ట్రస్థాయి స్థిరాస్తి నియంత్రణ సంస్థల వద్ద ప్రాజెక్టులను తప్పనిసరిగా నమోదు చేయించాలి. నమోదు రుసుంను సగానికి తగ్గించారు. 1,000 చదరపు మీటర్ల లోపు నిర్మాణాలకు అయితే, చదరపు మీటరుకు రూ.5 చొప్పున చెల్లించాలి. అంతకు మించిన ప్రాజెక్టులకు చదరపు మీటరుకు రూ.10 చొప్పున, గరిష్ఠంగా రూ.5 లక్షల మేర కట్టాలి.
* వాణిజ్య, మిశ్రమ సముదాయాలకు చదరపు మీటరుకు రూ.10, 15 చొప్పున గరిష్ఠంగా రూ.7 లక్షలు చెల్లించాలి.
* వాణిజ్య సముదాయాలకు చ.మీ.కు రూ.20-25 చొప్పున గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు చెల్లించాలి.
* స్థలాల అభివృద్ధికి చ.మీ.కు రూ.5 చొప్పున, గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు జమ చేయాలి.
* స్థిరాస్తి ఏజెంట్ల నమోదుకు కూడా వ్యక్తులు రూ.10,000, సంస్థ అయితే రూ.50,000 చెల్లించాలి. ముసాయిదాలో ఈ మొత్తాలను రూ.25,000, రూ.2,50,000 గా పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ పునరుద్ధరణ రుసుమును సగానికి తగ్గించారు.
* ప్రాజెక్టులో కొనుగోలుచేసిన వారికి రుసుము తిరిగి ఇవ్వాలన్నా, పరిహారం చెల్లించాల్సి వచ్చినా, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రామాణిక వడ్డీరేటుకు అదనంగా 2 శాతం జతచేసి, ప్రమోటర్లు చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత తేదీ నుంచి 45 రోజుల్లోగా ఇది చెల్లించాల్సి ఉంటుంది.

ఫిర్యాదులు చేసేందుకు..
నియంత్రణ సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు రూ.1,000 చొప్పున, స్థిరాస్తి అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు వెళ్లేందుకు రూ.5,000 చొప్పున చెల్లించాలి. ట్రైబ్యునల్‌ 60 రోజుల్లోపు ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంది. ఆదేశాలను ధిక్కరిస్తే ఫ్లాట్‌ రుసుంలో 10 శాతం చొప్పున డెవలపర్లు, కొనుగోలుదార్లు చెల్లించాల్సి వస్తుంది. జైలుశిక్ష కూడా విధించవచ్చు.