News

Realestate News

స్థానికులకే ప్రాధాన్యం కల్పించండి

vizag news

ముఖ్యమంత్రికి ఎంపీ, ఎమ్మెల్యేల విజ్ఞప్తి

పూడి (రాంబిల్లి), న్యూస్‌టుడే: సెజ్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏర్పాటుచేసే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నైపుణ్య శిక్షణ కేంద్రంలో స్థానికులకు శిక్షణ అందించి ఉద్యోగాల విషయంలో ప్రాధాన్యం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అనకాపల్లి లోక్‌సభ సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు సభాముఖంగా కోరారు. సెజ్‌లో పూడి వద్ద కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన నైపుణ్య శిక్షణ కేంద్రం(ఎంఎస్‌ఎంఈ) నిర్మాణానికి శనివారం భూమిపూజ అనంతరం జరిగిన సభలో ఎంపీ మాట్లాడారు. సికింద్రాబాద్‌లో ఉన్న ఎంఎస్‌ఎంఈ తెలంగాణలోకి వెళ్లిపోవడంతో ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి సెజ్‌లో ఎంఎస్‌ఎంఈ అవసరమని మంజూరు చేయించారన్నారు. ఈ కేంద్రం స్థానికులకే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్‌ అంతటికీ ఉపయోగపడుతుందని ముత్తంశెట్టి పేర్కొన్నారు. అన్ని రంగాలకు సంబంధించిన యువతకు ఇందులో అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తారన్నారు. సెజ్‌ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఉపాధి కల్పించే విషయంలో ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కేంద్రీయ విద్యాలయం మంజూరుచేయాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును సభాముఖంగా కోరారు. రూ.150 కోట్ల వ్యయంతో ఏర్పాటయ్యే ఎంఎస్‌ఎంఈ కేంద్రం ద్వారా పరిశ్రమలకు అవసరమయ్యే నైపుణ్య శిక్షణను యువతకు అందించడంతో ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 13 జిల్లాల్లో గాజువాక తరువాత పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురం సెజ్‌లో స్థానికులకు ఉద్యోగాల విషయంలో ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. సెజ్‌ కోసం సుమారు 9500 ఎకరాలు ఇచ్చిన నిర్వాసితులను గత పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో పట్టించుకోలేదన్నారు. రెండేళ్లలో ముఖ్యమంత్రి ఆశీస్సులతో వూహించని అభివృద్ధి చేశామన్నారు. సెజ్‌ పునరావాస కాలనీలో 2004 నుంచి 2014 వరకు ఇవ్వని ఇళ్లపట్టాలను మహిళల పేరుతో ఇచ్చామన్నారు. పరిశ్రమలకు కేటాయించిన 2500 ఎకరాల్లో నిర్వాసితులకు ఒప్పించి ఖాళీ చేయించి తరలించామన్నారు. పైపులైన్‌ నిర్మాణంతో ఉపాధి కోల్పోయే పూడిమడక మత్స్యకారులకు మంచి ప్యాకేజీ ఇవ్వాలని సీఎంను కోరారు. దుప్పితూరు గ్రామాన్ని తరలించేందుకు రూ.40కోట్లు, కొండకర్ల ఆవ అభివృద్ధికి, పూడిమడక, కొండకర్ల ఆవను పర్యటక కేంద్రంగా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. కలెక్టర్‌ యువరాజ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్‌ లాలం భవాని, తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి లాలం భాస్కరరావు, ఎలమంచిలి పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి, ఎంపీపీలు చేకూరి శ్రీనివాసరాజు, లక్ష్మీనాగరత్నం, ఎలమంచిలి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరసింగరావు, పూడి సర్పంచి లాలం జయ, అధికారులు పాల్గొన్నారు