News

Realestate News

సెజ్‌కు పెప్సికో

Real Estate News

రూ. 100 కోట్లతో పరిశ్రమ
600 మందికి ఉపాధి అవకాశాలు
రాంబిల్లి, న్యూస్‌టుడే

పారిశ్రామిక అభివృద్ధి కోసం అచ్యుతాపురంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. ఏపీఐఐసీ నిర్వహణలో ఉన్న సెజ్‌, నాన్‌సెజ్‌ స్థలాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించడంతో ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే సెజ్‌, నాన్‌సెజ్‌లో 40 రసాయన పరిశ్రమలకు స్థలాలు కేటాయించడంతో నిర్మాణాలు సాగుతున్నాయి. తాజాగా లాలంకోడూరు గ్రామానికి సమీపంగా నాన్‌ సెజ్‌ స్థలాల్లో పెప్సీ డ్రింక్‌ పరిశ్రమకు పది ఎకరాలు కేటాయించారు. సుమారు రూ. 100 కోట్లతో నిర్మించే ఆ పరిశ్రమ ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా కలిసి 600 మంది వరకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎన్‌టీపీసీ ప్రాజెక్టుకు ఆనుకొని నిర్మించిన విశాలమైన రహదారి పక్కన ఉన్న ప్లాట్‌నెంబరు-30ఎలో పది ఎకరాలను ఏపీఐఐసీ పెప్సీ కంపెనీకి కేటాయించింది. ఈ ఏడాది మార్చి నెలలో కృష్ణంపాలెం గ్రామం వద్ద నాన్‌ సెజ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన హిందుస్థాన్‌ కోకకోలా పరిశ్రమకు 100 ఎకరాలు కేటాయించారు. సుమారు రూ. 1400 కోట్లతో ఏర్పాటయ్యే ఆ పరిశ్రమలో సుమారు నాలుగువేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కూల్‌డ్రింక్‌లు తయారుచేసే ఈ రెండు పరిశ్రమల నిర్మాణం పూర్తయితే మొత్తం అయిదువేల మందికి ఉపాధి దొరుకుతుంది.

పరిశ్రమల నిర్మాణం వూపందుకుంది
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సెజ్‌లో పరిశ్రమల నిర్మాణం వూపందుకుంది. ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై పరిశ్రమలు నిర్మాణానికి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. పదేళ్ల క్రితం భూసేకరణ జరిగినా సెజ్‌లో ఏపీఐఐసీ నిర్వహణలో ఉన్న భూములు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశ్రమలకు రాయితీలు ప్రకటించడంతోపాటు ఆయనపై ఉన్న నమ్మకంతో పరిశ్రమల నిర్మాణాలకు ముందుకొస్తున్నారు. మా గ్రామానికి సమీపంగా ఏర్పడే పెప్సీ పరిశ్రమలో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నాము.

– లాలం రమేష్‌నాయుడు, సర్పంచి, లాలంకోడూరు

నమ్మకం కలుగుతోంది
మా గ్రామంలో సేకరించిన భూముల్లో ఎప్పుడు పరిశ్రమలు వస్తాయా? అని ఎదురుచూశాం. గడిచిన పదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా నిర్మాణం జరగలేదు. ఈ ఏడాది అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న కోకకోలా పరిశ్రమకు మా గ్రామంలో 100 ఎకరాలు నాన్‌సెజ్‌లో భూములను కేటాయించడంతో ఉపాధి దొరుకుతుందన్న నమ్మకం నిర్వాసిత కుటుంబాల్లో ఏర్పడింది. సుమారు రూ .1400 కోట్ల పెట్టుబడితే ఏర్పాటయ్యే ఆ పరిశ్రమ సీఎస్‌ఆర్‌ పథకంలో కేటాయించే నిధులతో గ్రామాభివృద్ధి కూడా జరుగుతుంది. ఆ పరిశ్రమలో నిర్వాసిత కుటుంబాలందరికీ ఉద్యోగవకాశాలు కల్పిస్తారని ఆశిస్తున్నాం.

– కశిరెడ్డి ప్రసాద్‌, సర్పంచి, కృష్ణంపాలెం