News

Realestate News

సింహాచలం గురుకులానికి మహర్దశ

Gurukulam school in Simhachalam Vizag development picture

మూడు నెలల్లో ఆదర్శ గురుకులంగా తీర్చిదిద్దుతాం
వుడా కార్యదర్శి శ్రీనివాస్‌

అడివివరం, న్యూస్‌టుడే: సింహాచలంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే ఏపీ బీసీ గురుకులాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దనున్నట్లు వుడా కార్యదర్శి, భీమిలి నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఎ.శ్రీనివాస్‌ తెలిపారు. మంత్రి గంటా శ్రీనివాసరావు సూచనల మేరకు బుధవారం ఆయన గురుకులాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సౌకర్యాలు, ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, కావాల్సిన ఇతర సదుపాయాల విషయమై ప్రిన్సిపల్‌ కె.సత్యవతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీనివాస్‌ మాట్లాడుతూ గురుకులం అభివృద్ధికి మూడు నెలల కాలపరిమితి నిర్దేశించుకున్నామన్నారు. పర్యటనలో భాగంగా తరగతి గదులు, పాఠశాల ప్రాంగణం, భోజనశాల వంటి ప్రాంతాలను సందర్శించి సమస్యలను తెలుసుకున్నామన్నారు. పాఠశాల భవనాలను నవీకరిస్తామన్నారు. కంప్యూటర్‌ ల్యాబ్‌, గ్రంథాలయం ఏర్పాటు చేస్తామన్నారు. తరగతి గదుల్లో టేబుళ్లు, డెస్కులు వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. విద్యార్థుల క్రీడల కోసం రెండు ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జీవీయంసీ నుంచి తాగునీటి సరఫరా కల్పిస్తామన్నారు. పారిశుద్ధ్యం మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మొత్తంగా మూడు నెలల్లో పనులు పూర్తి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ గురుకులంగా తీర్చిదిద్దుతామని వివరించారు. పర్యటనలో ఇంజినీరింగ్‌ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.