News

Realestate News

సింహగిరీశుడి చందన శోభ

సింహగిరీశుడి చందన శోభ
* ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన మంత్రి గంటా
* 1.75 లక్షల మంది వస్తారని అంచనా
వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు రెవెన్యూ, పోలీసు, దేవస్థానం అధికారులను ఆదేశించారు. మే 9న జరగనున్న చందనోత్సవ ఏర్పాట్లను మంత్రి గంటా గవర్నర్‌ బంగ్లాలో సోమవారం ఉదయం సమీక్షించారు. కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌, సీపీ అమిత్‌గార్గ్‌, డీసీపీ రవికుమార్‌మూర్తి, దేవస్థానం ఈవో రామచంద్రమోహన్‌, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, తెదేపా నాయకులు లాలం భాస్కర్రావు తదితరులు హాజరయ్యారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి గంటా విలేకర్లతో మాట్లాడారు. సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గత ఏడాది చందనోత్సవం రోజున 1.25 లక్షల మంది స్వామిని దర్శించుకున్నారని, ఈ సారి ఈ సంఖ్య 1.75 లక్షలు ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దర్శనాలు తెల్లవారుజాము 4 గంటల నుంచి మొదలయ్యేలా చూడాలన్నారు. వీఐపీ దర్శనాల సంఖ్యను తగ్గించాలన్నారు. వీఐపీ వాహనాలను సైతం కొండ దిగువన ఉంచేయాలని, అక్కడి నుంచి దేవస్థానం ఏర్పాటు చేసే వాహనాల్లో ప్రముఖులను తరలిస్తామన్నారు. రూ. 10 వేలు చెల్లించి దర్శనం టిక్కెట్లు తీసుకొనే భక్తులను ఏసీ బస్సుల్లో తీసుకొచ్చి దర్శనాలు కల్పిస్తామన్నారు. రూ.వెయ్యి టిక్కెట్టు కొనుగోలుచేసి దర్శనాలకు వచ్చే భక్తులకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో గంటసేపు చొప్పున కేటాయించి దర్శనం కల్పిస్తామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చలువ పందిళ్లు, షామియానాలు, క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు పంపిణీ చేసేందుకు తాగునీరు, మజ్జిగ వంటివి సిద్ధం చేయాలని, దీనికి సేవాసంస్థల సహాయం తీసుకోవాలన్నారు.

దుకాణాలు తొలగించవద్దు…
కొండమీద ఎప్పటినుంచో దుకాణాలు నిర్వహిస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించవద్దని మంత్రి గంటా ఆదేశించారు. బినామీ పేర్లతో, లీజుకు తీసుకొని వ్యాపారాలు చేసేవారిని మాత్రం తొలగించాలని ఈవోను ఆదేశించారు.

జూట్‌మిల్‌ యాజమాన్యంపై చర్యలు
తగరపువలసలో మూతపడ్డ జూట్‌ మిల్లు వ్యవహారంపై మంత్రి గంటా సమీక్షించారు. కలెక్టర్‌ యువరాజ్‌, కార్మిక శాఖ అధికారులు, పి.ఎఫ్‌ అధికారులు సమీక్షకు హాజరయ్యారు. యాజమాన్య ప్రతినిధులు ఆడిటింగ్‌నకు సహకరించకపోవడం వల్ల పీఎఫ్‌ క్లెయిమ్‌లను పరిష్కరించలేకపోతున్నామని మంత్రి దృష్టికి పీఎఫ్‌ అధికారులు తీసుకెళ్లారు. సహకరించకుండా మొండికేస్తున్న జూట్‌మిల్లు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

 

Source By: http://www.eenadu.net/