News

Realestate News

శ్రీచందనం.. సుగంధ పరిమళం!

vizagrealestate.com news

శ్రీచందనం.. సుగంధ పరిమళం!
సింహాచలం, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహగిరిపై శుక్రవారం చందన సుగంధ పరిమళాలు భక్తులకు మానసికోత్తేజాన్ని కలిగించాయి. అప్పన్న స్వామికి రెండో విడత చందన సమర్పణలో భాగంగా శుక్రవారం గంధం అరగదీత కార్యక్రమం ప్రారంభమైంది. ఆలయ బేడామండపంలోని రాళ్లపై తొలిరోజు సిబ్బంది 38 కిలోల చందనాన్ని అరగతీశారు. శ్రీచందనాన్ని అధికారులు తూకం వేసి ఆలయ భండాగారంలో భద్రపరిచారు. అరగదీత పూర్తయిన తర్వాత శ్రీగంధంలో సుగంధ ద్రవ్యాలు, వనమూలికలు మిళితం చేసి వైశాఖ పౌర్ణమి రోజున స్వామికి రెండోవిడతగా సమర్పిస్తారు.

ప్రముఖుల పూజలు..: శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విశాఖ రేంజి డీఐజీగా నూతన బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్‌, ప్రముఖ నృత్యకారిణి మంజుభార్గవి స్వామిని దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో ప్రముఖుల గోత్రనామాల పేరిట స్వామికి పూజలు జరిపారు. స్వామి వారి ప్రసాదం అందచేశారు.

* విశాఖ నగరానికి చెందిన కె.అప్పారావు అనే భక్తుడు అప్పన్నస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళంగా సమర్పించారు. విరాళాన్ని ఆలయ ఏఈవో ఆర్వీవీఎస్‌ ప్రసాద్‌కు ఈ విరాళం అందచేశారు.

Source : http://www.eenadu.net/