News

Realestate News

వుడా ప్రాజెక్టులు పరుగో.. పరుగు!

news vizag 2016

శరవేగంగా పనుల పూర్తి
రేపు సీతమ్మధార వాణిజ్య సముదాయం ప్రారంభం
ఈనాడు – విశాఖపట్నం
విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పనులు ఒక్కటిగా పూర్తవుతున్నాయి. దాదాపు పదేళ్లుగా నత్తనడకగా సాగడంతో అంచనా వ్యయం భారీగా పెరిగింది. గత ఏడాదిన్నరగా వీటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడంతో దశల వారీగా నిర్మాణాలు పూర్తవుతున్నాయి. సీతమ్మధారలో రూ. 8 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అధునాతన వాణిజ్య సముదాయం ఇదే కోవకు చెందుతుంది. దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ప్రారంభించనున్నారు. వుడా ఆధ్వర్యంలో వివిధ ప్రాజెక్టుల పనులు ప్రారంభించడం తప్పితే పూర్తి చేయడం అంతంత మాత్రమే. దీంతో అంచనా విలువలు కూడా పెరిగి వుడాకు ఆర్థికంగా భారమవుతోంది. పదేళ్ల క్రితం ప్రారంభించిన వివిధ ప్రాజెక్టుల పనుల్లో జాప్యంతో వుడాపై దాదాపు రూ. 5 కోట్ల అదనపు భారం పడింది. వుడా ఉపాధ్యక్షుడిగా డాక్టర్‌ బాబూరావునాయుడు బాధ్యతలు చేపట్టాక పెండింగులోని ప్రాజెక్టులు పూర్తి చేయడమే ప్రథమ ప్రాధాన్యంగా ఇంజినీర్లను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు మ్యూజియంను ప్రారంభించారు. రూ. 121 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన హరిత హౌసింగ్‌ ప్రాజెక్టు పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. రూ. 35 కోట్లతో పారంభించిన సిటీ సెంట్రల్‌ పార్కు, రూ. 22 కోట్లతో ప్రారంభించిన చిల్డ్రన్‌ ధియేటర్‌ పనులు వచ్చే నెలాఖరుకు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో చేపట్టిన 12 మాస్టర్‌ ప్లాను రహదారుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని రాబోయే రెండు నెలల్లో పూర్తి చేసేలా డాక్టర్‌ బాబూరావునాయుడు ఇంజినీర్లకు లక్ష్యాలు నిర్దేశించారు. సీతమ్మధార వాణిజ్య సముదాయాన్ని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంవీపీ వాణిజ్య సముదాయ పనులు మరో నెల రోజుల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. భీమునిపట్నంలో రూ. 3 కోట్లతో చేపట్టిన స్టేడియం, అనకాపల్లిలో మరో రూ. 3 కోట్లతో చేపట్టిన రావుగోపాలరావు కళ్లాక్షేత్రం ఆధునికీకరణ పనులు కూడా పూర్తయ్యాయి. నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల పనులు రాబోయే రెండు నెలల్లో పూర్తి చేసి ప్రారంభిస్తామని బాబూరావునాయుడు తెలిపారు. తరువాత కొత్త పనులపై దృష్టి సారించి సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వుడా ప్రాజెక్టులు సకాలంలో పూర్తికావన్న అపవాదు తొలగించడమే ముందున్న లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.