News

Realestate News

విశాఖ వేదికగా జాతీయ అథ్లెటిక్స్‌ మీట్‌

Real Estate News Vizag

విశాఖ వేదికగా జాతీయ అథ్లెటిక్స్‌ మీట్‌
నవంబరు 18, 19, 20 తేదీల్లో నిర్వహణ
400 జిల్లాల నుంచి 500 క్రీడా బృందాల రాక
రాష్ట్ర క్రీడాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం
విశాఖపట్నం, ఈనాడు: విశాఖ వేదికగా ఈ ఏడాది నవంబరు 18, 19, 20 తేదీల్లో జాతీయ అంతర్‌ జిల్లా జూనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. విశాఖలోని కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ప్రాంతీయ, జిల్లా క్రీడాధికారులు, అథ్లెటిక్‌ అసోసియేషన్లు, శాప్‌ కోచ్‌లతో సమీక్షించారు. గతేడాది విశాఖలో నిర్వహించిన క్రీడలకంటే మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖలోని పోర్టు స్టేడియంతోపాటు కొమ్మాది స్టేడియంలోనూ ఈ క్రీడల నిర్వహణకు ఏర్పాట్లు చెయ్యాలని సూచించారు. 200 మీటర్లు, 400 మీటర్ల రన్నింగ్‌ ట్రాక్‌ను సిద్ధం చెయ్యాలన్నారు. ఈ క్రీడాపోటీల నిర్వహణకు ఎంత ఖర్చవుతుంది.. కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై వారం రోజుల్లో నివేదిక అందజేయాలని సూచించారు. 13 ఈవెంట్లలో 400 జిల్లాలకు చెందిన 500 క్రీడా బృందాలు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రవాణా, భోజన, వసతి ఏర్పాట్లు చెయ్యాలని అధికారులకు ఆదేశించారు. నిర్వహణకు అవసరమైన నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన నిధులకు తోడుగా దాతల నుంచి నిధుల సేకరిస్తామన్నారు. ఈ క్రీడల నిర్వహణపై ఈ నెలాఖరులోగా మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రతిభ కనబరిస్తే ఉపకార వేతనాలు: ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని.. క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి ఐదేళ్లపాటు ఉపకార వేతనాలు మంజూరు చెయ్యాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. సమావేశంలో శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ ప్రతినిధి నాగరాజు, రాష్ట్ర అథ్లెటిక్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్రరావు, శాప్‌ అథ్లెటిక్‌ కోచ్‌ వినయ్‌ ప్రసాద్‌, ఇండియన్‌ అథ్లెటిక్‌ కోచ్‌ శ్రీనివాస్‌, ఉత్తరాంధ్ర ప్రాంతీయ క్రీడల పర్యవేక్షణ అధికారి సూర్యారావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జూన్‌ గ్యాలియట్‌ రోడ్రిగ్స్‌ తదితరులు పాల్గొన్నారు.