News

Realestate News

విశాఖ నగరానికి మరో మణిహారం

vizag real estate news

విశాఖ నగరానికి మరో మణిహారం
రానున్న ఐ.టి.పి.ఒ. ప్రాంతీయ కార్యాలయం
జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక ప్రదర్శనలకు అవకాశం
ఈనాడు – విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇతర దేశాలకు ఎగుమతులను భారీగా పెంచేందుకు ‘భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ’ (ఐ.టి.పి.ఒ.) ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఈ సంస్థ వస్తే రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో మరో కీలకమైలురాయిని అధిగమించినట్లేనని పారిశ్రామికవర్గాలు పేర్కొంటున్నాయి.

దేశంలోని వివిధ రంగాల ఉత్పత్తులతో ఐటీపీవో ఏటా జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలను నిర్వహిస్తోంది. ఇతర దేశాల్లోనూ భారీ ప్రదర్శనలను నిర్వహించింది. ప్రముఖ పారిశ్రామిక సంస్థలు, సంఘాలతో సమన్వయంతో పనిచేస్తూ వాటి ఉత్పత్తులకు అంతర్జాతీయ గిరాకీని తీసుకురావడానికి కృషి చేస్తోంది. దీని ప్రధాన కేంద్రం దిల్లీ. చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ముంబయిల్లో ప్రాంతీయ కేంద్రాలున్నాయి. ఆయా నగరాలకు దగ్గరగా ఉన్న పారిశ్రామిక సంస్థల సౌజన్యంతో నిర్వహిస్తున్న భారీ వాణిజ్య ప్రదర్శనలకు ఆదరణ లభిస్తోంది. దిల్లీలోని ప్రగతిమైదాన్‌లో భారీ వాణిజ్య ప్రదర్శన భవనం ఉంది. కర్ణాటకలో ‘బెంగళూరు ట్రేడ్‌ సెంటర్‌’, తమిళనాడులో ‘చెన్నై ట్రేడ్‌ సెంటర్‌’లను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో కేంద్రం అత్యాధునికంగా తీర్చిదిద్దింది. వివిధ రంగాలు ఎలా అభివృద్ధి సాధిస్తున్నాయి? పోటీని తట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర కీలకాంశాలపై నిపుణులతో సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తుంటుంది. విదేశాల్లోని వివిధ ఉత్పత్తుల దిగుమతిదారులను భారతదేశ ఎగుమతిదారులను ఒక వేదికపైకి తేవటంలోనూ ఐ.టి.పి.ఒ. కీలకపాత్ర పోషిస్తోంది. పారిశ్రామికరంగాలకు అవసరమైన కీలక సమాచారాన్ని, విశ్లేషణలను, గణాంకాలను అందిస్తుంటుంది.

ఐ.ఐ.పి.కి బదులుగా.….
విశాఖ నగరంలో ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌’ (ఐ.ఐ.పి.) సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని, అనుబంధంగా వంద ఎకరాల్లో ప్యాకేజింగ్‌ పార్కును ఏర్పాటు చేయాలని ఎంపీ హరిబాబు చేసిన ప్రతిపాదనకు అప్పట్లో కేంద్రం ఆమోదించింది. అనంతరం ఇక్కడికొచ్చిన ఐ.ఐ.పి. ప్రతినిధులు స్థలం, అనుకూలతలను పరిశీలించి సానుకూలంగా స్పందించారు. చివరి నిమిషంలో ఐ.ఐ.పి.ని కాకినాడకు మార్చేశారు. ఈ నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయంగా ఐ.టి.పి.ఒ. ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని ఎంపీ హరిబాబు సూచించారు. విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్టు ఉన్నాయని, ఏటా రూ.వేల కోట్ల ఎగుమతులు వందకు పైగా దేశాలకు ఎగుమతవుతున్నందున ఐ.టి.పి.ఒ. ఏర్పాటు చేస్తే బాగుంటుందని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌తో మాట్లాడానని ఎంపీ హరిబాబు ‘ఈనాడు’కు వెల్లడించారు. ఆమె సానుకూలంగా స్పందించారని తెలిపారు.