News

Realestate News

విరాట్‌ కోసం రూ. వెయ్యి కోట్లు

Virat

విరాట్‌ కోసం రూ. వెయ్యి కోట్లు

మ్యూజియం, హోటల్‌గా మలచే ప్రయత్నం
ప్రాథమిక నివేదిక సిద్ధం చేసిన యంత్రాంగం
ఈనాడు – విశాఖపట్నం

రత నావికాదళంలో త్వరలో సేవలను ఉపసంహరించుకోనున్న ఐఎన్‌ఎస్‌ యుద్ధనౌక విరాట్‌ను విశాఖలో మ్యూజియంగా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం సుమారు రూ. 1000 కోట్ల వ్యయమవుతుందని నిపుణులు అంచనా వేశారు. సేవల ఉపసంహరణ తరువాత నౌకను ముంబాయి నుంచి విశాఖ తీరానికి చేర్చి, మ్యూజియంగా, నక్షత్రాల హోటల్‌గా తీర్చిదిద్దడానికి ఈ నిధులు అవసరమని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. ఈ నౌక కోసం మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, గుజరాత్‌ రాష్ట్రాలు ప్రయత్నాలను తీవ్రం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారు. ఇటీవల విశాఖ నగర పర్యటనకు వచ్చిన తూర్పు నావికాదళ ప్రధానాధికారితోనూ సమావేశమై చర్చించారు. కేంద్రంలో ఉన్నతస్థాయి వర్గాలతోనూ ముఖ్యమంత్రి సంప్రదింపులు చేశాక అటు నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలోనే సీఎం తదుపరి చర్యల కోసం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పర్యాటకశాఖ అధికారులు సమావేశమై యుద్ధనౌక విరాట్‌ను విశాఖ తీరానికి తీసుకొచ్చేందుకు ఉన్న మార్గాలు, ఇందుకయ్యే ఖర్చు, ఇతర సాంకేతికాంశాలపై చర్చించారు. భీమునిపట్నం బీచ్‌లో యుద్ధనౌకను మ్యూజియంగా ఏర్పాటు చేస్తే అన్ని విధాలా బాగుంటుందన్న అభిప్రాయానికి జిల్లా యంత్రాంగం వచ్చిందని తెలుస్తోంది.
ప్రస్తుతం కొచ్చి నావికాదళంలో ఐఎన్‌ఎస్‌ విరాట్‌ ఉంది. సేవల ఉపసంహరణ కోసం ముంబయి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అక్కడ వీడ్కోలు చెప్పాక నౌకలోని దాదాపు అన్ని యంత్రాలనూ తొలగిస్తారు. విరాట్‌ సేవలు ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టత లేనప్పటికీ, డిసెంబరులోగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. నౌకలోని అన్ని విభాగాలనూ తొలగించాక ముంబయి నుంచి విశాఖ తీరానికి వేరొక నౌక సాయంతో తీసుకురావాలి. ఇందుకోసం 3 నుంచి 4 నెలల సమయం పట్టొచ్చని నిపుణుల అంచనా. దీన్ని భీమునిపట్నం బీచ్‌లో మ్యూజియంగా, హోటల్‌గా అభివృద్ధి చేయాలంటే రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుంది. భీమునిపట్నం తీరంలో యుద్ధనౌకను నిలిపి.. ఒడ్డు నుంచి అక్కడికి వెళ్లేందుకు రహదారి, నౌక ఆవరణలో 300 వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలి. ఆర్కే బీచ్‌లో ప్రస్తుతం ఉన్న ఐఎన్‌ఎస్‌ కురుసుర జలాంతర్గామిని మ్యూజియంగా ఏర్పాటు చేసేందుకూ 2002లో విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) దాదాపు రూ. 10 కోట్లు ఖర్చు చేసింది. విరాట్‌ కోసం ప్రాథమికంగా రూ1,000 కోట్లు ఖర్చు చేస్తే ప్రభుత్వ లక్ష్యం మేరకు మ్యూజియం, ఆతిధ్యమిచ్చే హోటల్‌గా సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలపై తదుపరి చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు ‘ఈనాడు’కి తెలిపారు.