News

Realestate News

వన భారతికి.. సంకల్ప హారతి!

plantation to save forests in vizag pic

వన సంరక్షణకు కదిలిన అటవీ అధికారులు
జిల్లావ్యాప్తంగా ఉద్యమంలా కార్యక్రమం
2.24 కోట్ల మొక్కలు నాటేందుకు శ్రీకారం

విశాఖపట్నం, ఈనాడు: అధికారులు కదిలారు.. పలుగు పార పట్టారు.. ప్రతి కార్యాలయం ఆవరణలోనూ గోతులు తవ్వి.. మొక్కలు నాటారు. చిటపట చినుకులు సవ్వడి చేస్తున్నా.. మొక్కవోని దీక్షతో వన భారతికి సంకల్ప హారతి పట్టారు. నిత్యం వన సంరక్షణలో నిమగ్నమయ్యే అటవీ అధికారులంతా ‘ఈనాడు – ఈటీవీ’ పిలుపుతో ‘వన భారతి- జనహారతి’ కార్యక్రమంలో సోమవారం ఉదయం పాల్గొని మరో మహాక్రతువుకు నడుం బిగించారు. మూడు జిల్లాల అదనపు ముఖ్య అటవీ సంరక్షణాధికారి ఎన్‌.ప్రతీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అటవీ సర్కిల్‌ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడితే.. మూడు టెరిటోరియల్‌ డీఎఫ్‌వో కార్యాలయాలు, ఒక సామాజిక అటవీ డీఎఫ్‌వో, నాలుగు సబ్‌ డీఎఫ్‌వో కార్యాలయాలు, 20 టెరిటోరియల్‌ రేంజి కార్యాలయాలు, ఐదు సోషల్‌ ఫారెస్ట్‌ రేంజి కార్యాలయాల్లో స్థానిక అధికారులు ఈ క్రతువులో ఉత్సాహంగా పాల్గొని వేలాది మొక్కలు నాటారు.

జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం అదనపు ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి ఎన్‌.ప్రతీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో బాదం, బొగడ, కదంబ, మహాగని, ఏగిస, కానుగ తదితర మొక్కలు నాటారు. విశాఖ డీఎఫ్‌వో బి.ధనుంజరావు, అటవీ రేంజి అధికారి పి.ఆంజనేయరాజు, సోషల్‌ ఫారెస్ట్‌ రేంజర్లు ప్రసాద్‌, సోమసుందరం సర్కిల్‌, డీఎఫ్‌వో, సోషల్‌ ఫారెస్ట్‌ కార్యాలయాల పాలనా విభాగం సిబ్బంది పాల్గొన్నారు. మొక్కలు నాటి వర్మీకంపోస్టు చల్లి వాటి సంరక్షణ చర్యలు చేపట్టారు.

ఆగస్టు మాసాంతానికి లక్ష్యం పూర్తి..
ఈ వానాకాలంలోనే వీలైనన్ని మొక్కలు నాటాలి.. ఆగస్టు మాసాంతానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 2.24 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తిచేస్తామని అదనపు ముఖ్య అటవీ సంరక్షణాధికారి ఎన్‌.ప్రతీప్‌కుమార్‌ తెలిపారు. టెరిటోరియల్‌, సోషల్‌ ఫారెస్టు పరిధిలో ఈమొక్కలు నాటేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. వనభారతి- జనహారతి పేరుతో ‘ఈనాడు- ఈటీవీ’ ప్రజా ప్రయోజనార్థం మొక్కల పెంపకాన్ని వూరూవాడా ఉద్యమంలా చేపట్టడం అభినందనీయమని అన్నారు. కార్యాలయాలు, పరిశ్రమలు, గృహాల దగ్గర మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం హర్షణీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో తామూ భాగస్వాములమయ్యామని వెల్లడించారు. ప్రభుత్వం ‘వనం- మనం’ కార్యక్రమం నిర్వహణకు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో ఒకే రోజు 10 లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు. విశాఖపట్నంలో 42 శాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని 50 శాతానికి పెంచాలన్నదే తమ ముందున్న లక్ష్యమని ప్రతీప్‌కుమార్‌ వెల్లడించారు.