News

Realestate News

వంద అడుగులకు అనకాపల్లి-అచ్యుతాపురం

vizag real estate news

వంద అడుగులకు అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి విస్తరణ
ఉడా ఆధ్వర్యంలో పనులు
ఎలమంచిలి ఎమ్మెల్యే రమేష్‌బాబు
మునగపాక, న్యూస్‌టుడే: ప్రధాన సమస్యగా మారిన అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి విస్తరణ పనులు విశాఖ ఉడా ఆధ్వర్యంలో త్వరలో చేపట్టనున్నట్టు ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తెలిపారు. రహదారిని వంద అడుగులకు మాత్రమే విస్తరించేలా చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. ఆదివారం మునగపాక విచ్చేసిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో (ఎస్‌ఈజడ్‌) పరిశ్రమలు పెరుగుతున్న దృష్ట్యా రహదారిని 150 అడుగులకు తక్కువ లేకుండా విస్తరించాలని అధికారులు చెబుతున్నారన్నారు. 150 అడుగులకు విస్తరిస్తే అనేకమంది తీవ్రంగా నష్టపోతారని… బాధితుల విన్నపం మేరకు వంద అడుగులకు మాత్రమే విస్తరించాలని తెలిపామన్నారు. రహదారి విస్తరణ పనులు ఆర్‌అండ్‌బీ వుడాకి బదలాయించిందన్నారు. వుడా ఆధ్వర్యంలో మూడు, నాలుగు మాసాల్లో పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. సోమవారం ఆర్‌ అండ్‌ బీ అధికారులు, వుడా అధికారులు ఈ రహదారిని పరిశీలిస్తారని చెప్పారు. ఈ రోడ్డును విస్తరించాల్సి ఉన్నందునే తారురోడ్డు నిర్మించలేదన్నారు. తాత్కాలికంగా గోతులు పూడ్పిస్తున్నామని చెప్పారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. ఇక తాగునీటి సమస్య పరిష్కరించేందుకు ఎలమంచిలి నియోజకవర్గంలోని తొమ్మిది గ్రామాల్లో రక్షిత తాగునీటి పథకాలు నిర్మించేందుకు రూ. 2.29 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేశామన్నారు. ఆ నిధులతో రామగిరి, ఆవసోమవరం, ఎం.జగన్నాథపురం, మల్లవరం, రామభద్రపురం, రేగుపాలెం, చినకలవలాపల్లి, ఏటికొప్పాక గ్రామాల్లో రక్షిత నీటి పథకాలు నిర్మిస్తామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లలో చేసిన అభివృధ్ధిని ప్రజలకు వివరించేందుకు నవంబరు ఒకటినుంచి జనచైతన్య యాత్రలు నెల రోజులపాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్వాక్రా మహిళలకు రెండో విడతగా ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 2500 కోట్లు రుణమాఫీ చేశారన్నారు. రుణమాఫీ సొమ్మును డ్వాక్రా సంఘాల ఖాతాలకు జమ చేయనున్నట్టు తెలిపారు. వచ్చే జనవరి నుంచి నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఆడారి మంజు, మండల తెదేపా అధ్యక్షుడు దాడి ముసిలినాయుడు, జిల్లా తెదేపా బీసీ సెల్‌ అధ్యక్షుడు బీమరశెట్టి శ్రీను, జిల్లా తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు కడియం అనూరాధ, మండ ల తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆడారి జానకి, టెక్కలి పరశురామ్‌, యల్లపు భాస్కరరావు, దొడ్డి శ్రీను, ఆడారి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.