News

Realestate News

రైల్వేస్టేషన్లో వైఫై

Vizag Real Estate News

వేగం 10 ఎంబీపీఎస్‌
అధికారికంగా ప్రారంభం
అరగంట పాటు ఉచితం

ఈనాడు – విశాఖపట్నం, న్యూస్‌టుడే – రైల్వేస్టేషన్‌ : మొబైల్‌లో 1 ఎంబీపీఎస్‌, 2 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో అంతర్జాలం ఉంటేనే అబ్బో అనుకుంటాం. విశాఖ రైల్వేస్టేషన్‌లో 10 ఎంబీపీఎస్‌ హైస్పీడ్‌తో మొబైల్‌ ద్వారా అంతర్జాల సేవలు అరగంటపాటు ఉచితంగా వినియోగించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సేవలను శుక్రవారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు దిల్లీ నుంచి ప్రారంభించారు. గత రెండు నెలల నుంచి విశాఖ రైల్వేస్టేషన్లో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఇప్పుడు అధికారికంగా అమల్లోకి వచ్చినట్లయింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన డిజిటల్‌ ఇండియాలో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

మరీ ఇంత స్పీడనుకోలేదు.. : దిల్లీలో సురేష్‌ప్రభు ఈ కార్యక్రమాన్ని వీడియో లింక్‌ ద్వారా మీట నొక్కి ప్రారంభించారు. విశాఖ రైల్వేస్టేషన్‌లో ఈ సేవల్ని ఎంపీ కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్యేలు గణబాబు, విష్ణుకుమార్‌రాజు, డీఆర్‌ఎం చంద్రలేఖముఖర్జీ కలిసి ఈ సేవల్ని తమ మొబైల్‌లో వినియోగించుకున్నారు. సమావేశంలో ఎంపీ హరిబాబు మాట్లాడుతూ ఏకంగా 10 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో నెట్‌ ఉంటుందని డీఆర్‌ఎం చెబితే ఆశ్చర్యపోయానన్నారు. ఇది విశాఖకే గర్వకారణమని చెప్పారు. విశాఖ రైల్వేస్టేషన్‌లో లిఫ్టు, ఎస్కలేటర్‌ సౌకర్యాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అరకు వెళ్లే పర్యాటకుల కోసం అద్దాల బోగీలతో రైలు కూడా మూడు నెలల్లో వస్తుందంటున్నారని వివరించారు. విశాఖకు రైల్వేజోన్‌ వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించామని తెలిపారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ విశాఖను త్వరలో రైల్వేజోన్‌గా ప్రకటించబోతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ విమానాశ్రయంలో లేని సౌకర్యం విశాఖ రైల్వేస్టేషన్‌లో అందుబాటులోకొచ్చిందన్నారు. రైల్వే యూనియన్‌ నాయకులు పి.మోహన్‌రావు, ఎం.అప్పారావు, డి.షలీల్‌, తెదేపా, భాజపా నేతలు పాల్గొన్నారు.

సేవలు ఇలా…
* ఉచిత వైఫై సేవలను వినియోగించుకోవాలంటే టికెట్‌ కొని కచ్చితంగా రైల్వేస్టేషన్‌లోకి వెళ్లాల్సిందే.

* మొబైల్‌లో వైఫై ఆన్‌ చేసి బ్రౌజర్‌ ద్వారా railwire.co.in లోకి వెళ్లి ఫోన్‌ నెంబరు ఎంటర్‌ చేయాలి. ఆ వెంటనే నాలుగు అంకెల కోడ్‌ మొబైల్‌కు అందుతుంది. దాన్ని పాస్‌వర్డ్‌గా వినియోగించి లాగిన్‌ అవ్వొచ్చు.

* ఈ సేవలు అరగంట పాటు ఉచితం. ఆ తరువాత ఛార్జీ పడుతుంది.

Source : http://www.eenadu.net/