News

Realestate News

మోదకొండమ్మ అనుపోత్సవానికి అంతా సిద్ధం

మోదకొండమ్మ అనుపోత్సవానికి అంతా సిద్ధం
జిల్లా మంత్రుల రాక నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం
పాడేరు, న్యూస్‌టుడే: రాష్ట్ర గిరిజన జాతర మోదకొండమ్మ తల్లి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆదివారం మొదలైన ఈ ఉత్సవాలు భక్త జనసందోహం మధ్య హోరెత్తాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్థానిక సతకంపట్టు వద్ద అమ్మవారు కొలువుదీరారు. జాతర మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు సమర్పించేందుకు వచ్చిన భక్తుల తాకిడితో సతకంపట్టు భక్తి భావంతో పులకించింది. ప్రతి రోజు సాయంత్రం వేళలో అమ్మవారికి ప్రీతి పాత్రమైన డప్పు వాయిద్యాలతో ఘాటాలను పట్టణ వీధుల్లో వూరేగించారు. ఎక్కడికక్కడ భక్తులు అమ్మవారి అనుగ్రహన్ని పొంది తన్మయం చెందారు. ఉత్సవాల్లో మూడ్రోజుల్లో భాగంగా మంగళవారం అమ్మవారి అనుపోత్సవానికి సంబంధించి ఆలయ, ఉత్సవ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా మోదకొండమ్మ ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు గుడి వెనుక భాగంలో ప్రత్యేక సదుపాయం కల్పించారు. భక్తుల రద్దీని తట్టుకొనే విధంగా దేవాలయం ప్రాంగణంలో సాధారణ, ముఖ్యమైన భక్తులకు వేర్వేరుగా వరుసలు సిద్ధం చేశారు. వీఐపీ పాసులను సిద్ధం చేసి సంబంధీకులకు జారీ చేశారు. అనుపోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి దేవాలయం భక్తుల తాకిడి పెరగనున్నందున ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసుల దేవాలయ ప్రాంగణాన్ని తమ పరిధిలో తీసుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి అనుపోత్సవం స్థానిక సతకంపట్టు వద్ద నుంచి నేల డాన్సులు, వివిధ కళా, సాంస్కృతిక ప్రదర్శనలతో వైభవంగా ప్రారంభం కానుంది. పట్టణ పురవీధుల మీదుగా వూరేగుతూ రాత్రి తొమ్మిది గంటల సమయంలో గర్భగుడికి ఉత్సవ విగ్రహం చేరుకోవటంతో ఉత్సవాలు ముగింపు కానున్నాయి.

Source : http://www.eenadu.net/