News

Realestate News

మార్కెటింగ్‌ శాఖలో ఈ-పర్మిట్‌

NewsRealEstate

సెస్సు చెల్లింపు ఇక ఆన్‌లైన్‌లోనే
మార్కెటింగ్‌ శాఖ ఉప సంచాలకుడు సుధాకర్‌
పెదబొడ్డేపల్లి (నర్సీపట్నం అర్బన్‌), న్యూస్‌టుడే: వ్యాపారులంతా ఇకపై మార్కెటింగ్‌ శాఖకు ఆన్‌లైన్‌ ద్వారానే సెస్సు చెల్లించవచ్చు. ఇందుకు వీలుగా కొద్దిరోజుల్లో ‘ఈ-పర్మిట్‌’ విధానం అమల్లోకి తెస్తున్నట్టు మార్కెటింగ్‌శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు పి.వి.సుధాకర్‌ వెల్లడించారు. సోమవారం ఆయన తనను కలిసిన విలేకర్లతో మాట్లాడుతూ ఈ పర్మిట్‌ విధానం అమలుపై అవగాహన కల్పించేందుకు ఈనెల 7న తన పరిధిలోని నాలుగుజిల్లాల అధికారులకు సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సెస్సు చెల్లించగానే బార్‌కోడింగ్‌ విధానంలో రశీదు వస్తుందన్నారు. చెక్‌పోస్టుల్లో వీటిని చూపవచ్చని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు పక్కదారి పట్టకుండా ఈ కొత్త విధానం సహకరిస్తుందని తెలిపారు. విజిలెన్స్‌ బృందాల తనిఖీలు పెంచుతామని, చెక్‌పోస్టుల్లోనూ నిఘా ఉంటుందని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విశాఖజిల్లాలో రూ.1283 లక్షలు, శ్రీకాకుళం జిల్లాలో రూ.2679లక్షలు, విజయనగరం జిల్లాలో 1353లక్షలు, శ్రీకాకుళం జిల్లాలో రూ.7033లక్షలు సెస్సువసూళ్లు లక్ష్యంగా నిర్థేశించామన్నారు. ఈ ఏడాది మే వరకు నాలుగు జిల్లాల్లో రూ.1670లక్షలు వసూలైందన్నారు. రైతుబంధు పథకాన్ని రైతులంతా వినియోగించుకోవాలని కోరారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలేనప్పుడు సరకుని యార్డు గోదాములో నిల్వచేసి సరకు విలువలో 75శాతం నగదు రుణంగా పొందవచ్చన్నారు. గరిష్ఠంగా రూ.2లక్షలు వరకు వడ్డీలేని రుణమిస్తామని తెలిపారు.

లింకు రోడ్లకు ‘ఉపాధి’
మార్కెటింగ్‌ శాఖలో మళ్లీ లింకురోడ్ల నిర్మాణం మొదలు కాబోందని సుధాకర్‌ తెలిపారు. తన పరిధిలోని నాలుగు జిల్లాల్లో 50 మార్కెట్‌ కమిటీలు ఉన్నాయన్నారు. కమిటీ ఆదాయంలో 20 శాతం సొమ్ము లింకురోడ్లకు ఖర్చు చేసుకోవచ్చన్నారు. అదే మొత్తాన్ని ఉపాధిహామీ పథకంలో నుంచి చెల్లిస్తారని వివరించారు. విశాఖ జిల్లాలో ఉపాధిహామీ నిధులు, మార్కెటింగ్‌శాఖ నిధులు కలిపి రూ.2.80 కోట్లు వరకు లింకు రోడ్లకు వెచ్చించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని తెలిపారు. మిగిలిన జిల్లాల్లోనూ ప్రతిపాదనలు చేశారన్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు సూచనతో నర్సీపట్నంలో రైతుబజారు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ములగాడ రైతుబజారు మంగళవారం ప్రారంభమవుతుందని తెలిపారు. నర్సీపట్నం, ఎలమంచిలిలో పండ్లు మగ్గించే కేంద్రాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. అనకాపల్లిలో ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ విధానం అమల్లో ఉందని ఆయన వెల్లడించారు..