News

Realestate News

మన నగరం… మరింత పరిశుభ్రం

vizag real estate news

మన నగరం… మరింత పరిశుభ్రం
బహిరంగ విసర్జన రహితంగా ప్రకంటించిన కలెక్టర్‌
2017 డిసెంబరుకు ‘స్వచ్ఛ జిల్లా’ను సాధిస్తాం
కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: విశాఖను బహిరంగ విసర్జన రహిత(ఓడీఎఫ్‌)నగరంగా కలెక్టర్‌, జీవీఎంసీ ప్రత్యేకాధికారి ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఏయూ వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంతకముందు మద్దిలపాలెం కూడలి నుంచి ఆడిటోరియం వరకూ స్వచ్ఛ రాయబారులు, మహిళా సంఘాల ప్రతినిధులతో ర్యాలీ నిర్వహించారు. ఆడిటోరియంలో కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో మరే ఇతర నగరంలోనూ సాధ్యపడని విధంగా 12వేల వ్యక్తిగత మరుగుదొడ్లు నగరంలో నిర్మించామని, సామాజిక మరుగుదొడ్లను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. నగరంలో 197 బహిరంగ విసర్జన ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నవారికి వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు నిర్మించామన్నారు. నగరాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించామని, రెండు వారాలపాటు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నట్లు తెలిపారు. ఎక్కడైనా సమస్యలుంటే తెలియజేయాలన్నారు. జిల్లాలో 2 లక్షల మరుగుదొడ్లు నిర్మాణం చేయాల్సి ఉందని, డిసెంబరు 2017 కల్లా వాటిని పూర్తి చేసి, స్వచ్ఛ జిల్లాగా ప్రకటిస్తామన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ స్వచ్ఛ నగరానికి ప్రాధాన్యత ఇవ్వడం సంతోషమని, రాష్ట్ర ప్రభుత్వం నగరానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో అధికారుల కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు జీవీవీఎస్‌ మూర్తి, ఎస్‌ఎస్‌ వర్మ, మోహన్‌రావు, జోనల్‌ కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్‌ కార్యక్రమం అమలులో ప్రతిభ కనపరిచిన అధికారులకు ప్రశంసాపత్రాలను కలెక్టర్‌ చేతులమీదుగా అందజేశారు.