News

Realestate News

మనోహరం.. సింహాచలం

vizagreslestate news

మనోహరం.. సింహాచలం

సుందరీకరణ పనులకు ప్రణాళికలు

ఆధ్యాత్మిక చింతన, మనోవికాసం కోసం ఎంతో మంది ఆశిస్తారు. యాంత్రిక జీవనం సాగించే ప్రస్తుత పరిస్థితుల్లో ఆహ్లాదం, అందమైన ప్రదేశాలు పర్యటించి మనోల్లాసం పొందాలని కోరుకుంటారు. ఇలాంటి పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం

ఇటీవల అధ్యయనం చేసి భగవంతుడిని దర్శించేందుకు విచ్చేసే భక్తులకు భక్తిభావంతో పాటు మంచి వాతావరణం కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని దేవాలయాల పరిసరాల్లో సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే సింహాచలం క్షేత్రాన్ని సుందర మనోహరగిరిగా తీర్చిదిద్దనున్నారు.

-సింహాచలం, న్యూస్‌టుడే
మెట్లమార్గం..
భక్తులు కాలినడకన సింహగిరికి చేరుకునే కొండమెట్ల మార్గం ఇరువైపులా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి రూ.12లక్షల వ్యయంతో ప్రణాళికలు రూపొందించారు. మెట్లమార్గం ఇరువైపులా గల ఖాళీ స్థలంలో గన్నేరు, గరుడ వర్ధనం, నంది వర్ధనం, పారిజాతం, నూరు వరహాలు, వంటి పుష్పజాతుల మొక్కలు పెంచుతారు. కొన్ని చోట్ల పూలమొక్కల మధ్య పచ్చిక బయళ్లు పెంచి దేవతా విగ్రహాలు ఏర్పాటు చేసి భక్తుల్లో మరింత భక్తిభావం పెంపొందించాలని ప్రణాళికలు రూపొందించారు.

రూ. 3కోట్లతో అభివృద్ధి పనులు : రూ. 3కోట్లతో సింహాచలంలో వరాహ పుష్కరిణి, కొండమెట్ల మార్గం, పూలతోట, సింహగిరిపై పలు ప్రాంతాల్లో సుందరీకరణ పనులకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

పూలతోటకు పూర్వవైభవం : ఎంతో చారిత్రాత్మకమైన అప్పన్న స్వామి పూలతోటకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. రూ.80లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు అంచనాలు తయారు చేశారు. 11ఎకరాల విస్తీర్ణంలో గల ఉద్యానవనంలోని నాలుగు మడులను అప్పన్న స్వామి నిత్య పూజలకు అవసరమయ్యే చామంతి, గులాబీ, ఎక్సోరా, ఆల్‌మూడ్‌, వంటి పూలమొక్కలు పెంచుతారు. వీటితో పాటు స్వామికి ప్రీతిపాత్రమైన సంపెంగ మొక్కలను పెంచనున్నారు. రాతితో శంకు చక్రాలను నిర్మించి వాటి మధ్యలో పచ్చని గడ్డిని పెంచి అందంగా తీర్చిదిద్దుతారు.

సింహగిరిపై ఉద్యానవనాలు : సుందరీకరణ పనుల్లో భాగంగా సింహగిరిపై బస్టాండు సమీపంలో గల మూడు రహదారుల కూడలి మధ్య రూ.10 లక్షలతో మొక్కలు పెంచనున్నారు. ఇక్కడ రహదారులకు ఇరువైపులా గులాబీ, చామంతి, బంతి, సంపెంగ, తదితర మొక్కలు పెంచుతారు. నిత్యానదాన భవనం, నృసింహ మండపం, మాడవీధుల్లో ఇప్పటికే పచ్చదనం పనులు చేపట్టారు.

వరాహ పుష్కరిణికి మహర్దశ
కొండ దిగువన ఉన్న అప్పన్న స్వామి వరాహ పుష్కరిణిని రూ.25లక్షల వ్యయంతో ఉద్యానవనంగా అభివృద్ధి చేయడానికి అంచనాలు తయారు చేశారు. పుష్కరిణి గట్లను అభివృద్ధి చేసి పసుపు గన్నేరు, తెలుపు, గులాబీ రంగుల దేవకాంచనం, కుంద మొక్కలు, బిస్మార్కియా, బోగన్‌విల్లే, వంటి పూలమొక్కలతో అందంగా తీర్చిదిద్దుతారు. వీటితో పాటు కొబ్బరి మొక్కల పెంపకం చేపడతారు. పుష్కరిణిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అంచనాలు పరిశీలించి పనులు ప్రారంభం : సుందరీకరణ పనుల కోసం తయారు చేసిన ప్రణాళికలు, అంచనాలను పరిశీలించి త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. పట్టణ సుందరీకరణ, పచ్చదనం సంస్థ ఎండీ చంద్రమోహన్‌ రెడ్డితో ఇటీవల చర్చించాం. అంచనాలు పరిశీలించిన తర్వాత టెండర్లు పిలుస్తాం.
-కె.రామచంద్రమోహన్‌, సింహాచలం దేవస్థానం ఈవో

Source : http://www.eenadu.net/